ముగిసిన మొదటిరోజు ఆట.. భార‌త్ 37/1 .

రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా భారత్‌, దక్షిణాఫ్రికా జ‌ట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్‌లో వికెట్ న‌ష్ట‌పోయి 37 ప‌రుగులు చేసింది. కేఎల్ రాహుల్ (13), వాషింగ్ట‌న్ సుంద‌ర్ (6) లు క్రీజులో ఉన్నారు. ద‌క్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భార‌త్ ఇంకా 122 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది..ద‌క్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో త‌క్కువ స్కోరుకు ప‌రిమితం చేశామ‌న్న ఆనందం భార‌త్‌కు ఎంతో సేపు నిల‌వ‌లేదు. ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ (12) జ‌ట్టు స్కోరు 18 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ గా ఔట్ అయ్యాడు. అత‌డిని మార్కో జాన్సెన్ పెవిలియ‌న్‌కు చేర్చాడు. వ‌న్‌డౌన్‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్ వ‌చ్చాడు..

అంత‌క‌ముందు తొలి ఇన్నింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ద‌క్షిణాఫ్రికా మొద‌టి ఇన్నింగ్స్‌లో 55 ఓవ‌ర్ల‌లో 159 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్ల‌లో ఐడెన్ మార్‌క్ర‌మ్ (31) టాప్ స్కోర‌ర్‌. వియాన్ ముల్డర్ (24), టోనీ డి జోర్జీ (24), ర్యాన్ రికెల్టన్ (23), ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ (15 నాటౌట్‌) లు ప‌ర్వాలేద‌నిపించారు..కెప్టెన్ టెంబా బ‌వుమా (3) విప‌లం అయ్యాడు. భార‌త బౌల‌ర్ల ధాటికి ఐదుగురు స‌ఫారీ బ్యాట‌ర్లు సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు. ఇక టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో బుమ్రా ఐదు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మ‌హ్మ‌ద్ సిరాజ్‌, కుల్దీప్ యాద‌వ్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. అక్ష‌ర్ ప‌టేల్ ఓ వికెట్ సాధించాడు..