ఇండియా, చైనా యుద్ధం తృటిలో త‌ప్పింది,,,,,,,,,,,,,.

ఇండియా, చైనా మ‌ధ్య ఏడాది కాలంగా ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలుసు క‌దా. ప‌శ్చిమాన‌ వాస్త‌వాధీన రేఖ నుంచి తూర్పున అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ వ‌ర‌కూ ఏదో ఒక చోటు చైనా తోక జాడించ‌డం, దానికి ఇండియా దీటుగా బ‌దులివ్వ‌డం జ‌రుగుతూనే ఉంది. ముఖ్యంగా తూర్పు ల‌ఢాక్ ప్రాంతంలో రెండు దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్ర‌క్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. గ‌ల్వాన్ లోయ ఘ‌ట‌న త‌ర్వాత ఇది మ‌రింత తీవ్ర‌మైంది. అయితే 9 నెల‌లు రెండు దేశాల మ‌ధ్య పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నా.. ఒక‌సారి మాత్రం దాదాపు యుద్ధం ప్రారంభ‌య్యేలా క‌నిపించింద‌ని లెఫ్ట్‌నెంట్ జ‌న‌ర‌ల్ వైకే జోషి తాజాగా వెల్ల‌డించారు. న్యూస్‌18 చానెల్‌తో మాట్లాడిన ఆయ‌న తూర్పు ల‌ఢాక్‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పారు.ట్రిగ్గర్ నొక్క‌డ‌మే ఆల‌స్యం
ఆయ‌న చెప్పిన‌దాని ప్ర‌కారం గ‌తేడాది ఆగ‌స్ట్ 31న ఇండియా, చైనా మ‌ధ్య దాదాపు యుద్ధం ప్రారంభ‌మైనంత ప‌ని జ‌రిగింది. అంత‌కుముందు ఆగ‌స్ట్ 29, 30 తేదీల్లో ఇండియా వ్యూహాత్మ‌క ప్రాంత‌మైన కైలాశ్ రేంజెస్‌ను ఆక్ర‌మించింది. ఇది చైనాను షాక్‌కు గురి చేసింది. దీంతో పీపుల్స్ రిప‌బ్లిక్ ఆర్మీ కౌంట‌ర్ ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టింది అని జోషి చెప్పారు. ఆగ‌స్ట్ 31న కైలాశ్ రేంజెస్ చేరుకోవ‌డానికి చైనీస్ ఆర్మీ ప్ర‌య‌త్నించింది. ఆ స‌మ‌యంలో ప‌రిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. గ‌ల్వాన్ తర్వాత ప్ర‌భుత్వం నుంచి మాకు పూర్తి స్వేచ్ఛ ల‌భించింది. ఎలాంటి ఆప‌రేష‌న్ అయినా చేప‌ట్టవ‌చ్చ‌ని ఆదేశాలు అందాయి. ఆ లెక్క‌న మా ట్యాంక్ మ్యాన్‌, గ‌న్న‌ర్‌, రాకెట్ లాంచ‌ర్ అంద‌రూ సిద్ధంగా ఉన్నారు. ఆ స‌మ‌యంలో వాళ్లు ట్రిగ్గ‌ర్ నొక్కితే చాలు యుద్ధం ప్రారంభ‌మ‌య్యేదే. అది పెద్ద క‌ష్ట‌మైన ప‌ని కాదు, ధైర్య‌మూ అవ‌స‌రం లేదు. కానీ ఆ స‌మ‌యంలో యుద్ధం జ‌ర‌గ‌కూడ‌ద‌ని మేము నిర్ణ‌యించుకున్నాము అని వైకే జోషి స్పష్టం చేశారు.

45 మంది చ‌నిపోయి ఉండొచ్చు
గ‌ల్వాన్ ఘ‌ర్ష‌ణ సంద‌ర్భంగా 45 మంది చైనా జ‌వాన్లు మ‌ర‌ణించార‌ని ఓ ర‌ష్య‌న్ ఏజెన్సీ ప్ర‌క‌టించిన విష‌యం తెలుసు క‌దా. జోషి కూడా నేరుగా నంబ‌ర్ చెప్ప‌క‌పోయినా.. అదే అయి ఉండొచ్చు అని అన్నారు. చైనా వైపు చ‌నిపోయిన వాళ్ల గురించి ఆర్మీ నుంచి ఇలాంటి ప్ర‌క‌ట‌న రావ‌డం ఇదే తొలిసారి. నేను ఎలాంటి అంచ‌నా వేయ‌ను. కానీ ఆ ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు మా వైపు ఆబ్జ‌ర్వేష‌న్ పోస్ట్‌లు ఉన్నాయి. చాలా మంది చనిపోయిన వాళ్ల‌ను స్ట్రెచ‌ర్ల‌లో తీసుకెళ్ల‌డం క‌నిపించింది. 60కిపైగానే ఇలా తీసుకెళ్లారు. అందులో అంద‌రూ చ‌నిపోయారా లేదా తెలియ‌దు. ర‌ష్య‌న్ ఏజెన్సీ చెప్పిన‌ట్లు 45 మంది లేదా అంత‌కంటే ఎక్కువే ఉండొచ్చు అని జోషి చెప్పారు.

చైనాకు కార్గిల్ హీరో స‌ల‌హా
కార్గిల్ యుద్ధ హీరో అయిన జోషి.. త‌న కెరీర్‌లో చాలా వ‌ర‌కూ ల‌ఢాక్‌లోని కొండ‌ల్లోనే గ‌డిపారు. ఆయ‌న‌కు చైనా భాష మాండ‌రిన్ చాలా బాగా వ‌స్తుంది. ఈ ఘ‌ర్ష‌ణ వ‌ల్ల చైనాకు చెడ్డ‌పేరు రావ‌డం త‌ప్ప వాళ్లు సాధించింది ఏమీ లేద‌ని జోషి స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా ఓ ప్ర‌ముఖ మాండ‌రిన్ సామెత‌ను కూడా ఆయ‌న చెప్ప‌డం విశేషం. దూరంగా ఉన్న బంధువు, ద‌గ్గ‌ర‌గా ఉన్న పొరుగువారు ఎప్ప‌టికీ స‌మానం కారు. అంటే పొరుగు వాళ్ల‌తో మంచి సంబంధాలు నెల‌కొల్ప‌డం ముఖ్యం కానీ.. దూరంగా ఉన్న బంధువుపై ఆధార‌ప‌డ‌టం స‌రికాదు అని దీని అర్థం అని జోషి చెప్పారు. ఇదే సామెత‌ను తాను చైనాకు చెబుతాన‌ని అన్నారు. మేము వాళ్ల‌తో మంచి పొరుగువారిగా ఉంటాము కానీ రెండు వైపులా ఆ న‌మ్మ‌కం అనేది ఉండాలి. ఆ న‌మ్మ‌కాన్ని క‌లిగించే బాధ్య‌త ఇప్పుడు చైనాపైనే ఉంది అని జోషి స్ప‌ష్టం చేశారు.