ఇది మా దేశం.ఈ నేలపై మాకే హక్కు ఉంది…లద్దాఖ్‌లో ఎల్‌ఏసీ వద్ద చైనా సైనికులకు చుక్కలు చూపించిన గొర్రెల కాపర్లు..

లద్దాఖ్‌లో భారతదేశ సరిహద్దు ప్రాంతంలో స్థానిక గొర్రెల కాపర్లు అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించారు…తమ దేశ భూభాగంలోకి రావొద్దని, గొర్రెలను మేపవద్దని అడ్డుపడిన చైనా సైనికులకు ఎదురొడ్డి నిలిచారు. ”ఇది మా దేశం. ఈ నేలపై మాకే హక్కు ఉంది. అడ్డుకుంటే రాళ్లతో కొట్టడానికైనా వెనుకాడబోం” అంటూ వాళ్లను బెదరగొట్టారు. జనవరి 2న భారత సరిహద్దుకు కిలోమీటరు లోపల కాక్‌జంగ్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని లద్దాఖ్‌లోని చుషుల్‌ ప్రాంత కౌన్సిలర్‌ కోన్‌చోక్‌ స్టాన్‌జిన్‌ వెల్లడించారు. గొర్రెల కాపర్లు చైనా సైనికులతో వాగ్వివాదానికి దిగిన వీడియోను మంగళవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆరున్నర నిమిషాలు ఉన్న ఈ వీడియోలో.. గొర్రెల కాపర్లు టిబెటన్‌ భాషలో చైనా సైనికులతో గొడవపడటం కనిపించింది. కొద్ది సేపటి తర్వాత వారు అక్కడున్న రాళ్లను చేతుల్లోకి తీసుకోవడం, విసరడం కూడా ఉంది. వీడియోలో చైనా సైనిక వాహనం కూడా కనిపించింది. అయితే, అక్కడ భారత సైనికులు ఎవరూ లేకపోవడం గమనార్హం..
జనవరి 12న భారత అధికారుల సందర్శన

కాక్‌జంగ్‌ ప్రాంతం లద్దాఖ్‌లోని న్యోమా నియోజకవర్గం కిందకు వస్తుందని స్టాన్‌జిన్‌ తెలిపారు. జనవరి 2న ఘటన జరిగిన రోజు చైనా సైనికులు.. కాక్‌జంగ్‌ తమ దేశ భూభాగమని, భారత గొర్రెల కాపర్లను వెనక్కు వెళ్లాలంటూ హెచ్చరించారని పేర్కొన్నారు. 35, 36వ పెట్రోలింగ్‌ పాయింట్ల వద్ద ఈ ఘటన జరిగిందని తెలిపారు. జనవరి 12న స్థానిక సర్పంచ్‌, సబ్‌ డివిజనల్‌ మెజిస్ర్టేటు, భారత సైనికులు, ఐటీబీపీ అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించినట్లు చెప్పారు. ఈ సమస్య అక్కడితోనే పరిష్కారమైందన్నారు. చలికాలంలో కాక్‌జంగ్‌లో గొర్రెలకు మేత బాగా దొరుకుతుందని స్థానికులు తెలిపారు. 2019లో ఒకసారి గొర్రెలను మేపడానికి వెళ్లినప్పుడు కూడా చైనా సైన్యం గొర్రెల కాపర్లను అడ్డుకుందని గుర్తు చేశారు. 2020 జూన్‌ 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే.

తాజా వీడియోపై కాంగ్రెస్‌ స్పందించింది. సరిహద్దుల్లో అంతా ప్రశాంతంగానే ఉందన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటనలు అంతా బూటకమేనని ఆరోపించింది. సరిహద్దుల్లో చైనా చొరబాట్లను మోదీ దాస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ విమర్శించారు. తమ ఆరోపణలకు తాజా వీడియో ఓ నిదర్శనమన్నారు. ఘటన భారత భూభాగానికి కిలోమీటరు లోపల జరిగితే.. అక్కడ భారత సైనికులు ఎందుకు లేరని, పెట్రోలింగ్‌ పాయింట్ల నుంచి ఎందుకు వెనక్కు వచ్చారని జైరాం రమేశ్‌ ప్రశ్నించారు…