ఇండియా దెబ్బ అంటే!. దెబ్బకు తోక ముడిచిన హైజాకర్లు..!

సోమాలియా (Somalia) తీరంలో హైజాక్(Hijack) గురైన ఎంవీ లీలా నార్ఫోక్ నౌకలోని 15 మంది భారతీయులతో పాటు మిగతా సిబ్బందిని ఇండియన్ నేవీ రక్షించింది.సోమాలియా తీరంలో గురువారం సాయంత్రం భారత్కు చెందిన నౌక హైజాక్కు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నౌకలోని భారత సిబ్బందిని రక్షించడానికి నేవీ రంగంలోకి దిగింది. నలువైపుల నుంచి గాలింపు చేపట్టింది. యుద్ధనౌక, సముద్ర గస్తీ విమానం, హెలికాప్టర్లు, P-8I, సుదూర లక్ష్యాలను ఛేదించే ప్రిడేటర్ MQ9B డ్రోన్లను మోహరించింది. ఓడను వదిలివేయమని సముద్రపు దొంగలకు హెచ్చరిక జారీ చేసింది.

ఎలైట్ కమాండోలు, మార్కోస్, కార్గో షిప్లోకి వెళ్లి 15 మంది భారతీయ సిబ్బందిని రక్షించారు. ఓడలో ఉన్న 15 మంది భారతీయులతో సహా మొత్తం 21 మంది సిబ్బందిని సిటాడెల్ నుంచి సురక్షితంగా తరలించినట్లు భారత నావికాదళ ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వల్ తెలిపారు. ఆ సమయంలో ఓడలో హైజాకర్లు లేరని, ఆ విషయాన్ని కమాండోలు ధృవీకరించారని ఇండియన్ నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇండియన్ నేవీ సముద్ర గస్తీ విమానం మొహరింపుతో సుముద్రపు దొంగలు తోక ముడిచారని ఓ అధికారి తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం ఆ ప్రాంతంలో పనిచేస్తున్న ఇతర ఏజెన్సీల సహకారం కూడా తీసుకున్నారు..

నౌకలోని పరిస్థితులను దగ్గర్నుంచి అంచనా వేసేందుకు అత్యాధునిక ఎంక్యూ9బీ ప్రిడేటర్‌ డ్రోన్‌ను రంగంలోకి దించారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పైఅధికారుల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ అందగానే కమాండోలు ఎంవీ లిలా నార్‌ఫోక్‌లోకి మెరుపు వేగంతో ప్రవేశించారు. వారిని చూసి పైరేట్లు తోకముడిచారు. గస్తీ సిబ్బంది ఇచ్చిన గట్టి హెచ్చరికలతోనే వారు భయపడి, నౌకను హైజాక్‌ చేసే ప్రయత్నాన్ని విరమించుకుని, పలాయన మంత్రం పఠించారని నేవీ ప్రతినిధి కమాండర్‌ వివేక్‌ మధ్వాల్‌ చెప్పారు.

నౌకలో విద్యుత్‌ వ్యవస్థను, చోదక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు కృషి జరుగుతోందని తెలిపారు. అన్నీ పూర్తయ్యాక నౌక ప్రయాణాన్ని మళ్లీ కొనసాగించనుందన్నారు. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకల స్వేచ్ఛా యానానికి అనువైన వాతావరణం కల్పించేందుకు ఇతర దేశాల భాగస్వామ్యంతో పనిచేసేందుకు నేవీ కట్టుబడి ఉంటుందని వివరించారు. సముద్ర దొంగల బారి నుంచి తమ నౌకను రక్షించిన భారత నేవీకి లిలా గ్లోబల్‌ సీఈవో స్టీవ్‌ కుంజెర్‌ ధన్యవాదాలు తెలిపారు. ఇలా ఉండగా, ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రభావం నౌకా రవాణాపైనా పడింది. 21 మంది భారతీయ సిబ్బందితో కూడిన లైబీరియాకు చెందిన ఎంవీ చెమ్‌ ప్లుటో నౌకపై డిసెంబర్‌ 23న భారత పశ్చిమ తీరంలో డ్రోన్‌ దాడి జరిగింది. భారత్‌ వైపు చమురుతో వస్తున్న మరో నౌకపై ఎర్ర సముద్రంలో డ్రోన్‌ దాడి జరిగింది. మాల్టాకు చెందిన ఎంవీ రుయెన్‌ అనే నౌకను పైరేట్లు డిసెంబర్‌ 14న హైజాక్‌ చేశారు.