పాక్ నేతలు నోరు అదుపులో ఉంచుకోవాలి….భారత్ స్ట్రాంగ్ వార్నింగ్…!

భారత్‌ను ఉద్దేశించి పాకిస్థాన్‌ నేతలు (Pakistan Leaders) చేస్తున్న ప్రేలాపనలను విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. వారు పదేపదే నిర్లక్ష్యపూరిత, యుద్ధోన్మాద, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని విదేశాంగశాఖ (India MEA) అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ తెలిపారు..తమ సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వారు భారత వ్యతిరేక గళాన్ని వినిపించడం అందరికి తెలిసిన విషయమేనన్నారు. ఏదైనా దుస్సాహసానికి పాల్పడటం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని.. ఈ నేపథ్యంలో తమ మాటలను కట్టిపెట్టడం మంచిదని మీడియా సమావేశంలో ఆయన హితవు పలికారు.

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) టారిఫ్‌లు విధించిన వేళ ఇరుదేశాల సంబంధాలపై రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌-అమెరికా (USA) భాగస్వామ్యం అనేక సవాళ్లు, మార్పులను తట్టుకుని నిలబడిందని చెప్పారు. ఇరుదేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం కీలకమైనదిగా పేర్కొన్నారు. ఉమ్మడి ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువలతో కూడిన సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇరుదేశాలు పంచుకుంటున్నాయని తెలిపారు. పరస్పర గౌరవం, ప్రయోజనాల ఆధారంగా ఇది మరింత ముందుకు సాగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెలాఖరు నాటికి ‘2+2’ సన్నాహాక సమావేశాన్ని ఏర్పాటు చేసే పనుల్లో ఇరుదేశాలు నిమగ్నమై ఉన్నాయన్నారు…అమెరికా పర్యటనలో భాగంగా పాకిస్థాన్‌ సైన్యాధిపతి అసీం మునీర్‌ ఇటీవల భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. తమది అణ్వాయుధ దేశమని.. అవసరమైతే అణు యుద్ధానికి దిగుతామని బెదిరింపులకు దిగారు. భారత్‌ దీన్ని తీవ్రంగా ఖండించింది. అమెరికా అండ చూసుకుని దాయాది తన అసలు రంగు చూపిస్తోందని మండిపడింది. మరోవైపు.. తమ దేశానికి చెందాల్సిన ఒక్క చుక్క నీటిని గుంజుకునేందుకూ భారత్‌కు అవకాశం ఇవ్వబోమని పాక్‌ (Pakistan) ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ వ్యాఖ్యానించారు. పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌, మాజీ మంత్రి బిలావల్‌ భుట్టోలు సైతం ఆయా సందర్భాల్లో అవాకులు చవాకులు పేలారు….

అంతకుముందు అమెరికా పర్యటనలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పాల్గొని భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ కు నీరు రాకుండా సింధూ నది జలాలను భారత్ నిలిపివేయడంపై మండిపడ్డారు. సింధూ నదిపై భారత్ కొత్తగా ఓ డ్యామ్ కడుతోందని.. ఆ డ్యామ్ పూర్తయ్యేంత వరకు వేచి చూసి పూర్తయ్యాక 10 మిసైల్స్ తో దాన్ని నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు పాకిస్థాన్ లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక ప్రకటన చేశారు. ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.