దౌత్యపరమైన రక్షణలను ఉపసంహరిస్తామని కెనడాకు ,, భారత్‌ అల్టిమేటం జారీ….అమెరికా, బ్రిటన్‌ దేశాలు కెనడాకు మద్దతు..!

సిక్కు వేర్పాటువాది, ఖలిస్థాన్‌ ఉగ్రవాది నిజ్జర్‌ (Hardeep Singh Nijjar) హత్యతో భారత్‌- కెనడా (India – Canada) మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదిరిన వేళ.. అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్‌ దేశాలు కెనడాకు మద్దతుగా నిలిచాయి. భారత్‌లోని 41 మంది కెనడా దౌత్యవేత్తలకు, వారి కుటుంబాలకు ఉండే అంతర్జాతీయ దౌత్యపరమైన రక్షణలను ఉపసంహరిస్తామని భారత్‌ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో ఆ దౌత్య సిబ్బందిని ఉపసంహరించుకుంటున్నట్టు కెనడా శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై అమెరికా, బ్రిటన్‌ దేశాలు స్పందించాయి. ఈ విషయంలో కెనడాకు మద్దతుగా నిలిచాయి.దౌత్యవేత్తల సంఖ్య తగ్గించాలంటూ కెనడాను ఒత్తిడి చేయొద్దని భారత ప్రభుత్వాన్ని కోరాయి. ‘దౌత్యసిబ్బంది సంఖ్య తగ్గించుకోవాలన్న భారత్ డిమాండ్ మేరకు కెనడా దౌత్యవేత్తల తరలింపు మాకు ఆందోళన కలిగిస్తోంది’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు. ‘క్షేత్రస్థాయిలో విభేదాలను పరిష్కరించేందుకు దౌత్యవేత్తలు అవసరం. దౌత్య సిబ్బందిని తగ్గించాలని పట్టుబడవద్దని మేము భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే నిజ్జర్‌ హత్య విషయంలో కెనడా దర్యాప్తునకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దౌత్య సంబంధాలపై 1961 వియన్నా ఒప్పందం ప్రకారం భారత్‌ తన బాధ్యతలను నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. ‘కెనడా దౌత్యవేత్తలు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలంటూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో మేం ఏకీభవించడం లేదు. కెనడా దౌత్యవేత్తల ఏకపక్ష తొలగింపు వియన్నా ఒప్పంద సూత్రాలకు అనుగుణం కాదు’ అని బ్రిటన్‌ వెల్లడించింది