బ్రిజ్ భూషణ్ పై ఓ మహిళా రెజ్లర్ చేసిన ఆరోపణ..కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ వివరాలు బయటకు..!!!

మహిళా వస్తాదులపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజెపీ ఎంపీ, భారత కుస్తీ సంఘం అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. అయినా.. తాము నిరసన వీడేదిలేదంటూ జంతర్ మంతర్ దగ్గర నిరాహారదీక్ష చేస్తున్న రెజ్లర్లు తెగేసి చెప్పారు.

దేశంలో అసలు ఏం జరుగుతోంది. ప్రపంచ, ఒలింపిక్స్ కుస్తీ పోటీలలో దేశానికి పతకాలు సాధించడం ద్వారా గౌరవం తెచ్చిన మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ అధికార పార్టీ ఎంపీ పై కేసు నమోదు చేయటానికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది..

రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై నమోదైన కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ వివరాలు బయటకు పొక్కాయి. పలు జాతీయ మీడియా సంస్థలు ఈ వివరాలను ప్రచురించాయి. ఇందులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. బ్రిజ్ భూషణ్ పై ఓ మహిళా రెజ్లర్ చేసిన ఆరోపణ ప్రధానంగా వినిపిస్తోంది. విదేశాలలో జరిగిన పోటీల్లో తాను గాయపడిన సందర్భంలో బ్రిజ్ భూషణ్ తనతో అసభ్యంగా మాట్లాడారని సదరు రెజ్లర్ ఆరోపించింది. తన కోరిక తీరిస్తే ట్రీట్ మెంట్ కు అయ్యే ఖర్చు మొత్తం ఫెడరేషన్ భరించేలా చూస్తానని చెప్పాడన్నారు.
బ్రిజ్ భూషణ్ కు భయపడి వీలైనంత వరకు తమ గదులలో నుంచి బయటకు రావడం మానేశామని రెజ్లర్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఒకవేళ బయటకు రావాల్సి వస్తే నలుగురు ఐదుగురం కలిసి వచ్చేవారమని వివరించారు. అయినా కూడా తమలో నుంచి ఒకరిని పక్కకు తీసుకెళ్లి అసభ్యంగా మాట్లాడేవారని చెప్పారు. కోచ్ లేని సమయంలో వచ్చి తమతో అసభ్యంగా ప్రవర్తించేవాడని అన్నారు. ఒకసారి తన టీషర్ట్ లాగారని, ఛాతీ, పొట్టపై అభ్యంతరకరంగా తాకారని మరో రెజ్లర్ ఫిర్యాదులో పేర్కొన్నారు…