ఇండియా కూటమి వరుస షాక్‌…ఆప్ సంచలన నిర్ణయం..

ఇండియా కూటమి వరుస షాక్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ.. అస్సాం లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకం విషయంలో జాప్యం పేరిట తన అభ్యర్థులను ఏకపక్షంగా ప్రకటించేసింది. దిబ్రూగఢ్ స్థానం నుంచి మనోజ్ ధనోవర్, గువాహటి నుంచి భాబెన్ చౌదరి, తేజ్‌పూర్ స్థానం నుంచి రిషి రాజ్ కౌటిన్యను బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆప్ ఎంపీ, పార్టీ నేషనల్ జనరల్ సెక్రెటరీ సందీప్ పాఠక్ కీలక ప్రకటన చేశారు…
ఈ చర్చలతో మేం అలిసిపోయాం. ఎన్నికల్లో నిలబడి గెలవాలనేదే మా లక్ష్యం. ఇక టైం లేదు. మేం ఇండియా కూటమి భాగస్వాములం. అయితే, ఈ సీట్లను కూటమి మాకే కేటాయిస్తుందని ఆశిస్తున్నాం..అని సందీప్ పాఠక్ పేర్కొన్నారు..ఎన్నికల్లో విజయానికి టైమింగ్, వ్యూహమే కీలకమని సందీప్ పాఠక్ మీడియా సమావేశంలో చెప్పారు. ‘‘ఇంకెంతకాలం చర్చిస్తారు. మనం ముందు పనిచేయాలి. మేము ఇండియా కూటమితోనే ఉన్నాం కానీ ప్రస్తుతం మాకు ఎన్నికల్లో గెలుపే కీలకం. ఎంత వేగంగా స్పందిస్తే విజయావకాశాలు అంతగా పెరుగుతాయి’’ అని ఆయన అన్నారు.

మిగతా కూటమి సభ్యులతో పోలిస్తే కాంగ్రెస్, ఆప్ మధ్య ఏకాభిప్రాయమే ఉందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. అనేక రాష్ట్రాల్లో ఇండియా కూటమి పార్టీలు ప్రత్యర్థులుగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

అస్సాంలో మొత్తం 14 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇక ఆప్ తన అభ్యర్థులను ప్రకటించిన మూడు స్థానాలకు ప్రస్తుతం బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 నాటి ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 9 సీట్లు గెలవగా కాంగ్రెస్ మూడింటిలో విజయం సాధించింది…