ఇండోనేసియాలోని హల్మహెరా ద్విపంలో ఉన్న డుకోనో అగ్నిపర్వతం శుక్రవారం బద్దలైంది. ఈ ఘటనలో ముగ్గురు పర్వతారోహకులు మృతి చెందగా, మరికొంత మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. విస్ఫోటనం సమయంలో అక్కడ 20 మంది పర్వతారోహకులు ఉండగా.. వారిలో 14 మందిని రక్షించామని, అందులో ఐదుగురికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. మృతుల్లో ఇద్దరు సింగపుర్ పౌరులు, ఒకరు ఇండోనేసియా వ్యక్తి ఉన్నట్లు తెలిపారు. మిగతా వారి కోసం సహాయక బృందాలతో గాలింపు కొనసాగుతోందన్నారు…
ఉత్తర మాలుకు ప్రావిన్స్లోని హల్మహెరా ద్వీపంలో ఉన్న మౌంట్ డుకోనో అగ్నిపర్వతాన్ని అధిరోహించేందుకు గురువారం తొమ్మిది మంది విదేశీయులు, 11 మంది స్థానిక హైకర్లతో కూడిన 20 మంది బృందం బయలుదేరింది. శుక్రవారం ఉదయం 7:41 గంటల సమయంలో వీరంతా పర్వత శిఖరానికి చేరుకుని, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న తరుణంలో అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. భారీ ఎత్తున పొగ, బూడిద, వేడి రాళ్లు పైకి ఎగిసిపడ్డాయి.
ఈ ప్రమాదం నుంచి ఇద్దరు జర్మన్ పర్యాటకులతో కలిసి తృటిలో తప్పించుకున్న స్థానిక మౌంట్ గైడ్ అలెక్స్ జాంగు ఆ క్షణాలను గుర్తుచేసుకుంటూ వణికిపోయారు. గురువారం మధ్యాహ్నం నుంచే భూమి లోపల నుంచి భారీ శబ్దాలు రావడం గమనించి డ్రోన్ ద్వారా పరిశీలించగా.. క్రేటర్ లోపల లావాతో కూడిన పదార్థాలు అసాధారణంగా పేరుకుపోయినట్లు తెలిసింది. శుక్రవారం ఉదయం మేము శిఖరానికి 100 మీటర్ల దూరంలో ఉండగా పెద్ద విస్ఫోటనం జరిగింది. కొందరు పర్యాటకులు అగ్నిపర్వత అంచున నిలబడి వీడియోలు తీసుకుంటున్నారు. రాళ్లు జారిపడుతుండటంతో నా క్లయింట్లను తీసుకుని కిందికి పరుగులు తీశానని జాంగు తెలిపారు.