మొదటి వన్డేలో టీమిండియా విజయఢంకా ..

మొదటి వన్డేలో టీమిండియా విజయఢంకా మోగించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. పేలవ ఫామ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేఎల్ రాహుల్ సూపర్ ఇన్నింగ్స్‌కు తోడు రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో భారత్ గెలుపొందింది. వైస్ కెప్టెన్సీ కోల్పోయి.. జట్టులో చోటే ప్రశ్నార్థకమైన సమయంలో కేఎల్ రాహుల్ ఎంతో సహనం పాటించి.. సహచరులు అందరూ ఔట్ అయిన చివరి వరకు క్రీజ్‌లో నిలబడి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 188 పరుగులకే ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా తడబడింది. చివరికి ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

టీమిండియా బౌలర్లు చెలరేగడంతో ఆసీస్ మొదట 188 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 189 రన్స్ ఈజీ టార్గెట్‌ను ఛేదించేందుకు చెమటోడాల్సి వచ్చింది. ఇషాన్ కిషన్ (3), శుభ్‌మన్ గిల్ (20), విరాట్ కోహ్లీ (4), సూర్యకుమార్ యాదవ్ (0) విఫలమవ్వగా.. హార్ధిక్ పాండ్యా (25) పర్వాలేదనిపించాడు. ఆస్ట్రేలియన్ బౌలర్లు తమ సూపర్ బౌలింగ్‌తో స్వల్ప లక్ష్యాన్ని చాలా కష్టతరం చేశారు. టీమిండియా 16 పరుగులకే 3 వికెట్లు.. 39 పరుగులకే 4 వికెట్లు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన కేఎల్ రాహుల్.. తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించాడు. హర్ధిక్ పాండ్యాతో కలిసి జట్టును నిలబెట్టిన రాహుల్.. రవీంద్ర జడేజాతో కలిసి భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. రాహుల్-జడేజా 6వ వికెట్‌కు 100కు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కేఎల్ రాహుల్ 91 బంతుల్లో 75 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా.. రవీంద్ర జడేజా 69 బంతుల్లో 45 పరుగులు చేసి కీ రోల్ ప్లే చేశాడు..