సూపర్-8 లో అఫ్గనిస్థాన్‌పై భారత్‌ విజయం..!

తమ సుదీర్ఘ కలను సాకారం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న భారత్‌ ఆ దిశగా అడుగులు ముందుకేస్తున్నది. గురువారం బార్బడోస్‌ వేదికగా జరిగిన సూపర్‌-8 తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై 47 పరుగుల తేడాతో భారత్‌ విజయదుందుభి మోగించింది. లీగ్‌ దశ విజయ పరంపరను కొనసాగిస్తూ సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది.

మొదట సూర్యకుమార్‌యాదవ్‌(28 బంతుల్లో 53, 5ఫోర్లు, 3సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్యా(24 బంతుల్లో 32, 3ఫోర్లు, 2సిక్స్‌లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 181/8 స్కోరు చేసింది. ఫజుల్లా ఫారుఖి(3/33), రషీద్‌ఖాన్‌(3/26) మూడేసి వికెట్లు తీశారు. లక్ష్యఛేదనలో బుమ్రా(3/7), అర్ష్‌దీప్‌సింగ్‌(3/36) ధాటికి అఫ్గన్‌ 20 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. అజ్మతుల్లా ఒమర్జాయ్‌(26) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అర్ధసెంచరీతో జట్టుకు పోరాడే స్కోరు అందించిన సూర్యకుమార్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. తమ తదుపరి మ్యాచ్‌లో శనివారం బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడుతుంది…..
టీమిండియా నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. రహ్మతుల్లా గుర్బాజ్‌ను అవుట్ చేసిన స్టార్‌ పేసర్‌ బుమ్రా… మరోసారి భారత్‌కు శుభారంభం అందించాడు. వికెట్లకు దూరంగా విసిరిన బంతిని వెంటాడిన గుర్బాజ్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో అఫ్గాన్‌ 13 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. పవర్‌ ప్లే నాలుగో ఓవర్‌లోనే బంతి అందుకున్న అక్షర్‌ పటేల్‌ వికెట్‌ తీసి అఫ్గాన్‌ను కష్టాల్లోకి నెట్టాడు. 11 బంతుల్లో ఎనిమిది పరుగులు చేసిన ఇబ్రహీం జద్రాన్‌ను అక్షర్‌ అవుట్‌ చేశాడు. దీంతో 23 పరుగుల వద్ద అఫ్గాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. అయితే ఇదే స్కోరు వద్ద మరో వికెట్‌ తీసిన బుమ్రా అఫ్గాన్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేశాడు. నాలుగు బంతుల్లో రెండు పరుగులు చేసిన జజాయ్‌ను బుమ్రా అవుట్‌ చేశాడు. దీంతో అదే 23 పరుగుల వద్ద అఫ్గాన్‌ మూడో వికెట్ కోల్పోవడంతో ఆ జట్టు పరాయజం దాదాపుగా ఖాయమైంది. అయితే ఒమ్రాజాయ్‌-నజీబుల్లా జద్రాన్‌ అఫ్గాన్‌ను కాసేపు ఆదుకున్నారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. అయితే రన్‌రేట్‌ భారీగా పెరిగి పోతుండడంతో వీరు భారీ షాట్లు ఆడక తప్పలేదు. నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించిన అనంతరం ఈ జంటను కుల్‌దీప్‌ యాదవ్ విడదీశాడు. దీంతో 67 పరుగుల వద్ద అఫ్గాన్ నాలుగో వికెట్‌కు కోల్పోయింది. ఆ తర్వాత వికెట్ల పతనం వేగంగా కొనసాగింది. నబీ 14, రషీద్‌ ఖాన్‌ 2, నూర్‌ అహ్మద్‌ ఆరు, నవీనుల్‌ హక్‌ డకౌట్‌ కావడంతో అఫ్గాన్‌ 134 పరుగులకే కుప్పకూలింది. దీంతో రోహిత్‌ సేన 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా నాలుగు ఓవర్లలో ఏడు పరుగులే ఇచ్చి మూడు వికెట్లు నేలకూల్చాడు. అర్ష్‌దీప్‌3, కుల్‌దీప్‌ రెండు వికెట్లు తీశారు…

Jasprit Bumrah T20 World Cup 2024.

టీ20 వరల్డ్ కప్ 2024లో ఓటమెరుగకుండా దూసుకుపోతోంది రోహిత్ సేన. వరుసగా గ్రూపు స్టేజిను విజయాలతో ముగించడమే కాకుండా సూపర్-8 స్టేజిలోనూ అఫ్గనిస్థాన్‌పై ఘన విజయం సాధించి శుభారంభాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా పేసర్ బుమ్రా కీలకంగా వ్యవహరించడమే కాకుండా ఇదే వేదికగా ఓ నయా రికార్డు నెలకొల్పాడు.

తక్కువ పరుగులిచ్చి ఎక్కువ వికెట్లు పడగొట్టిన ఇండియన్ బౌలర్‌గా బుమ్రా రికార్డుకెక్కాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్ వేసి ఏడు పరుగులే ఇవ్వడమే కాకుండా 3 వికెట్లు పడగొట్టాడు. గ్రూప్ దశలో యూఎస్ఏతో చెలరేగిన మరో టీమ్ఇండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను కూడా దాటేశాడు బుమ్రా. ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ వేసిన అర్ష్‌దీప్ 4 వికెట్లు పడగొట్టడమే కాకుండా 9 పరుగులు సమర్పించుకున్నాడు.

టీమ్ఇండియా బౌలర్లు అయిన అర్ష్‌దీప్, బుమ్రాల మధ్య చక్కటి పోటీ నెలకొంది. అర్ష్‌దీప్ ఇప్పటికే 10 వికెట్లు పడగొడితే, బుమ్రా నాలుగు టీ20 వరల్డ్ కప్ 2024లో 8 వికెట్లు పడగొట్టాడు. ఇదే కాకుండా జస్ప్రిత్ బుమ్రా పేరిట మరో రికార్డు నమోదైంది. టీ20 వరల్డ్ కప్‌లలో వరుసగా 7-8 మ్యాచ్ లలో చక్కటి ఎకానమీ కనబరిచిన ప్లేయర్‌గా ఘనత సాధించాడు. బుమ్రా తర్వాతి స్థానంలో సఫారీ ప్లేయర్ డేల్ స్టెయిన్ ఆరు వరల్డ్ కప్ మ్యాచ్‌లతో నిలిచాడు టిమ్ సౌతీ.

టీమ్ఇండియా విజయాల లిస్ట్ ఇదే :
నవంబర్ 2021 – ఫిబ్రవరి 2022 మధ్య 12 మ్యాచ్‌లు
డిసెంబర్ 2020 – జనవరి 2020 మధ్య 9 మ్యాచ్‌లు
డిసెంబర్ 2023 – జూన్ 2024 మధ్య 8 మ్యాచ్‌లు..