కొవిడ్‌ జాగ్రత్తలతో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు..

కొవిడ్‌ జాగ్రత్తలతో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ అన్నారు. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు ఈనెల 25 నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని అన్నారు. ఇప్పటివరకు 82 శాతం మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1768 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, 4,59,228 మంది పరీక్షలకు హాజరుకానున్నారని చెప్పారు. ఇందులో బాలురు 2,32,612, బాలికలు 2,26,616 మంది ఉన్నారని వెల్లడించారు. పరీక్షకు సంబంధించి మూడు సెట్ల ప్రశ్న పత్రాలు ఎంపిక చేశామన్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, లేకపోతే అనుమతించమని స్పష్టం చేశారు. విద్యార్థులు వాటర్‌ బాటిళ్లు తెచ్చుకోవచ్చని చెప్పారు.