ఐపీఎల్‌-14 ఛాంపియ‌న్‌ చెన్నై సూప‌ర్‌కింగ్స్…

ఐపీఎల్‌-14లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ ఛాంపియ‌న్‌గా నిలిచింది. దుబాయి వేదిక‌గా శుక్ర‌వారం జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌ను 27 ప‌రుగుల తేడాతో ఓడించింది. నాలుగో సారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. మొద‌ట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే ఓపెన‌ర్లు డుప్లెసిస్ (86), రుతురాజ్ గైక్వాడ్ (32) శుభారంభం చేశారు. గైక్వాడ్ ఔటైన త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన రాబిన్ ఉత‌ప్ప (31) ఫ‌ర్వాలేద‌నిపించాడు. గైక్వాడ్‌, ఉత‌ప్ప ఔటైన‌ప్ప‌టికీ డుప్లెసిస్ చెల‌రేగి ఆడాడు. ఫాస్ట్‌గా హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. ఉత‌ప్ప త‌ర్వాత వ‌చ్చిన మొయిన్ అలీ (37) కూడా దూకుడుగా ఆడాడు. దీంతో చెన్నై భారీ స్కోర్‌ను సాధించింది. కానీ ఇన్నింగ్స్ చివ‌రి బంతికి డుప్లెసిస్ ఔట‌య్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 3 వికెట్ల న‌ష్టానికి చెన్నై 192 ప‌రుగులు చేసింది.193 ప‌రుగుల ల‌క్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన కోల్‌క‌తా దూకుడుగా ఇన్నింగ్స్ మొద‌లుపెట్టారు. ఓపెన‌ర్లు వెంక‌టేశ్ అయ్య‌ర్ (50 ), శుభ్‌మ‌న్ గిల్ (51) ధాటిగా ఆడారు. చెరో హాఫ్ సెంచ‌రీతో మెరిశారు. కానీ వెంక‌టేశ్ అయ్య‌ర్ ఔట‌య్యాక‌ కోల్‌క‌తాకు వ‌రుస షాకులు త‌గిలాయి. వ‌రుస‌గా నితీశ్ రాణా డ‌కౌట్ అవ్వగా.. సునీల్ న‌రైన్ 2 ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేరాడు. చెన్నై బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో.. కోల్‌క‌తా ఆట‌గాళ్లు చ‌తికిల‌ప‌డ్డారు. దినేశ్ కార్తిక్ (9), ష‌కీబ్ (0), రాహుల్ త్రిపాఠి (2), మోర్గాన్ (4) ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్లు ముగిసేసరికి కోల్‌క‌తా 9 వికెట్ల న‌ష్టానికి ప‌రుగులు మాత్రమే చేసి.. టార్గెట్‌ను చేధించ‌డంలో విఫ‌ల‌మైంది. దీంతో ఐపీఎల్ 2021 ఛాంపియ‌న్‌గా నిలిచింది. నాలుగోసారి క‌ప్ గెలుపొందింది…