IPL.2022.. ముంబై ఇండియ‌న్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజ‌యం…

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ కేపిటల్స్ బోణీ కొట్టింది. ..

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ కేపిటల్స్ బోణీ కొట్టింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి ఖాతా తెరిచింది. ముంబై నిర్దేశించిన 178 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది…గెలుపోటములు ఇరు జట్ల మధ్య దోబూచులాడిన వేళ ఢిల్లీ బ్యాటర్లు లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ బంతిని చితక్కొట్టి జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించారు. ఢిల్లీ విజయానికి 16 బంతుల్లో 21 పరుగులు అవసరమైన వేళ లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ చెలరేగిపోయారు. 18వ ఓవర్ మూడో బంతిని లాంగాన్ మీదుగా స్టాండ్స్‌కు తరలించిన లలిత్ యాదవ్.. నాలుగో బంతిని బౌండరీకి తరలించి తన ఉద్దేశాన్ని స్పష్టంగా చాటాడు.
ఐదో బంతికి ఒక్క పరుగు రావడంతో అక్షర్ స్ట్రైకింగ్‌లోకి వచ్చి డేనియల్ శామ్స్ వేసిన స్లో డెలివరీని డీప్ స్క్వేర్ మీదుగా సిక్సర్‌గా మలిచాడు. అంతే.. ఒక్కసారిగా ఆట స్వరూపం మారిపోయింది. బుమ్రా వేసిన 19వ ఓవర్ తొలి బంతికి లలిత్ యాదవ్ సింగిల్ తీయగా, రెండో బంతిని అక్షర్ బౌండరీకి తరలించి అద్భుత విజయాన్ని అందించాడు. లలిత్ యాదవ్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 17 బంతుల్లో రెండు ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. ఇద్దరూ అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు. పృథ్వీషా 38, టిమ్ సీఫెర్ట్ 21 పరుగులు చేయగా, శార్దూల్ ఠాకూర్ 22 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో బాసిల్ థంపి మూడు, మురుగన్ అశ్విన్ రెండు వికెట్లు తీసుకోగా, టైమల్ మిల్స్‌కు ఓ వికెట్ దక్కింది.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 41 పరుగులు, తిలక్ వర్మ 22 పరుగులు చేయగా, వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 48 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, 177 పరుగులను కాపాడుకోవడంలో ఆ జట్టు విఫలమై మూల్యం చెల్లించుకుంది.