లక్నో జట్టు చిరస్మరణీయ విజయం… ఆఖరి బంతికి సింగిల్ తో లక్నో విజయం..
19 బంతుల్లోనే 62 పరుగులు చేసిన పూరన్.
ఉత్కంఠభరితంగా సాగిన 213 పరుగుల లక్ష్యఛేదనలో మార్కస్ స్టొయినిస్ ఇన్నింగ్స్ సూపర్ జెయింట్స్ కు ప్రాణం పోస్తే…. ఆ తర్వాత వచ్చిన నికోలాస్ పూరన్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా ఊచకోత కోశాడు. పూరన్ కేవలం 19 బంతుల్లోనే 62 పరుగులు చేశాడంటే అతడి విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ.
పూరన్ 4 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడు. పూరన్ ఉన్నంత సేపు మైదానం హోరెత్తిపోయింది. చివరికి సిరాజ్ బౌలింగ్ లో లాంగ్ లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
పూరన్ అవుటైన తర్వాత పరిస్థితి మారిపోయింది. మరో ఎండ్ లో ఉన్న ఆయుష్ బదోనీ కూడా వీరోచితంగా పోరాడాడు. ఓ అద్భుతమైన సిక్స్ కొట్టినా, అదే బంతికి హిట్ వికెట్ కావడంతో తీవ్ర నిరాశతో పెవిలియన్ చేరాడు. చివరి ఓవర్లో సూపర్ జెయింట్స్ విజయానికి 5 పరుగులు కావాల్సి ఉండగా, రెండు వికెట్లు పడిపోయాయి. ఆఖరి బంతికి ఒక రన్ కొడితే గెలుస్తారనగా… బౌలర్ హర్షల్ పటేల్ నాన్ స్ట్రయికింగ్ లో ఉన్న బిష్ణోయ్ ని మన్కడింగ్ ద్వారా అవుట్ చేసే ప్రయత్నం చేశాడు కానీ సాధ్యం కాలేదు. ఇక చివరి బంతి వికెట్ కీపర్ కు చేరినా….
క్రీజులో ఉన్న అవేశ్ ఖాన్, నాన్ స్ట్రయికర్ బిష్ణోయ్ మెరుపువేగంతో పరిగెత్తి లక్నో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసింది. కోహ్లీ 61, డుప్లెసిస్ 79 (నాటౌట్), మ్యాక్స్ వెల్ 59 పరుగులు చేశారు.