ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరును నమోదు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్..

హైదరాబాద్‌ 287/3 వర్సెస్ బెంగళూరు.
హైదరాబాద్‌ 277/3 వర్సెస్ ముంబయి.
కోల్‌కతా 272/7 వర్సెస్ ఢిల్లీ.
బెంగళూరు 263/5 వర్సెస్ పుణె.
లక్నో 257/5 వర్సెస్ పంజాబ్‌.
బెంగళూరు 248/3 వర్సెస్ గుజరాత్‌ లయన్స్‌.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరును నమోదు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. 2024 మార్చి 27న హైదరాబాద్ జట్టు 277/3 పరుగులు చేసిన ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరును నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ తన రికార్డును తానే బద్దలు కొడుతూ 287 పరుగులు చేసింది..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ జరిగిన మ్యాచులో ఈ స్కోరు నమోదైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ జట్టులో ట్రావిస్‌ హెడ్‌ 102, క్లాసెన్‌ 67, అభిషేక్‌ 34, మార్‌క్రమ్‌ 32 నాటౌట్, సమద్‌ 37 నాటౌట్ పరుగులతో మెరుపులు మెరిపించారు.

మొదటి నుంచి హైదరాబాద్ జట్టు బ్యాటర్లు ధాటిగా ఆడారు. వారు మెరిపించిన మెరుపులకు స్టేడియం మొత్తం విజిల్స్ తో దద్దరిల్లిపోయింది. కాగా, బెంగళూరు జట్టు బౌలర్లలో ఫెర్గుసన్‌ 2 వికెట్ల తీయగా, టాప్లే ఒక వికెట్‌ తీశాడు.

ట్రావిస్‌ హెడ్‌ (41 బంతుల్లో 102, 9 ఫోర్లు, 8 సిక్సర్లు), హెన్రిచ్‌ క్లాసెన్‌ (31 బంతుల్లో 67, 2 ఫోర్లు, 7 సిక్సర్లు) దంచికొట్టారు. అనంతరం ఛేదనలో ఆర్సీబీ కూడా ఎక్కడా తగ్గలేదు. 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసి విజయానికి 25 పరుగుల దూరంలో నిలిచింది. దినేశ్‌ కార్తీక్‌ (35 బంతుల్లో 83, 5 ఫోర్లు, 7 సిక్సర్లు), డుప్లెసిస్‌ (28 బంతుల్లో 62, 7 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్‌ కోహ్లీ (20 బంతుల్లో 42, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడారు. హెడ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు’ దక్కింది..

మాలో నుంచి ఎవడన్న బయటకు పోయిండనుకో. బిక్షు యాదవ్‌ వస్తాడు. ఆయన వచ్చాక బాల్‌తో కాదు. మీతో ఆడుకుంటడు’ అంటూ క్లాసెన్‌ గురించి ఆరెంజ్‌ ఆర్మీ ఫ్యాన్స్‌ సై సినిమాలో వైరల్‌ చేస్తున్న డైలాగ్‌ క్లాసెన్‌ చెవిన పడిందో ఏమో గానీ హెడ్‌ ఔట్‌ అవడంతోనే చిన్నస్వామిలో క్లాసెన్‌ షో మొదలైంది. దీంతో తీవ్ర ఆకలి మీదున్న పులికి జింకల మంద దొరికినట్టుగా అయింది ఆర్సీబీ బౌలర్ల పరిస్థితి. క్రీజులోకి వచ్చేప్పుడే ‘మినిమం సిక్స్‌’ అని మైండ్‌లో ఫిక్స్‌ అయ్యాడేమో ఏమో గానీ క్లాసెన్‌.. సిక్సర్‌ తప్ప సింగిల్స్‌ జోలికి వెళ్లలేదు.

అతడు 67 పరుగులు చేస్తే అందులో 42 పరుగులు సిక్సర్ల రూపంలో వచ్చినవే. క్లాసెన్‌ బాదుడుకు భయపడి 14వ ఓవర్‌ వేసిన మహిపాల్‌ లోమ్రర్‌.. నాలుగు వైడ్‌లు వేసి ‘హమ్మయ్యా నా ఓవర్‌ అయిపోయింది’ అనుకున్నాడు. ఆ తర్వాత బాధితులు విజయ్‌కుమార్‌, ఫెర్గూసన్‌. ఈ విధ్వంసంతో హైదరాబాద్‌ స్కోరు 15 ఓవర్లకే 200 దాటింది. ఫెర్గూసన్‌ 17వ ఓవర్లో క్లాసెన్‌ కొట్టిన 106 మీటర్ల సిక్సర్‌ మ్యాచ్‌కే హైలైట్‌. ఇదే ఓవర్లో క్లాసెన్‌.. వైశాక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగడంతో ఆర్సీబీ ఊపిరి పీల్చుకుంది. హెడ్‌, క్లాసెన్‌లు డగౌట్‌లో ఉన్నా జమ్మూ కుర్రాడు అబ్దుల్‌ సమద్‌తో కలిసి మార్క్మ్‌ సన్‌రైజర్స్‌కు రికార్డు స్కోరును కట్టబెట్టాడు. టాప్లీ 19వ ఓవర్లో సమద్‌.. 4,4,6,6,4తో రెచ్చిపోతే ఆఖరి ఓవర్లో మార్క్మ్‌ 4,6తో హైదరాబాద్‌.. ఈ సీజన్‌లో తమ రికార్డు (277)ను తామే బద్దలుకొట్టింది..

రికార్డు ఛేదనను బెంగళూరు ధాటిగానే ఆరంభించింది. 6 ఓవర్లకే ఆ జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. కోహ్లీ, డుప్లెసిస్‌లు పవర్‌ ప్లేలో తమదైన షాట్లతో పవర్‌ చూపించారు. భువనేశ్వర్‌, షాబాజ్‌, నటరాజన్‌ బౌలింగ్‌లో ఈ ఇద్దరూ చూడచక్కని షాట్లతో అలరించారు. కానీ హెడ్‌ స్థానంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన మయాంక్‌ మార్కండే.. 7వ ఓవర్లో రెండో బంతికి కోహ్లీని క్లీన్‌బౌల్డ్‌ చేసి ఆర్సీబీ పతనానికి కొబ్బరికాయ కొట్టాడు..ఖతం.. కోహ్లీ పెవిలియన్‌ చేరగానే ఆర్సీబీ తర్వాతి బ్యాటర్లు అలా వచ్చి ఇలా వెళ్లారు. విల్‌ జాక్స్‌ (7) రనౌట్‌ కాగా రజత్‌ పాటిదార్‌ (9) మయాంక్‌ బౌలింగ్‌లో నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత కమిన్స్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి బెంగళూరు బెంగను మరింత పెంచాడు. 23 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తిచేసుకున్న డుప్లెసిస్‌.. పదో ఓవర్‌ మూడో బంతికి క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగగా ఆఖరి బంతికి సౌరవ్‌ చౌహన్‌ (0) వికెట్ల ముందు దొరికిపోయాడు..

భయపెట్టిన కార్తీక్‌.

122 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన బెంగళూరు 262 దాకా వచ్చిందంటే అది దినేశ్‌ కార్తీక్‌ చలవే. గెలుపుపై ఆశలే లేని స్థితి నుంచి గెలుస్తామేమో అన్నట్టుగా కార్తీక్‌ విధ్వంసం సాగింది. లోమ్రర్‌ (19)తో కలిసి ఆరో వికెట్‌కు 59 పరుగులు జోడించిన కార్తీక్‌.. అనూజ్‌ రావత్‌ (25 నాటౌట్‌)తో ఏడో వికెట్‌కు 63 రన్స్‌ జతచేశాడు. బౌలర్‌ ఎవరన్నదీ లెక్కచేయకుండా బంతిని స్టాండ్స్‌లోకి పంపడమే తన డ్యూటీ అన్నట్టుగా కార్తీక్‌ వీరవిహారం చేశాడు. 23 బంతుల్లోనే 50 పూర్తిచేసిన కార్తీక్‌.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించాడు. ఎట్టకేలకు నటరాజన్‌ 19వ ఓవర్లో ఐదో బంతికి క్లాసెన్‌ క్యాచ్‌ పట్టడంతో కార్తీక్‌ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ముగిసింది. అనూజ్‌ ఆఖరి ఓవర్లో 18 పరుగులు రాబట్టడంతో ఆర్సీబీ విజయానికి 25 పరుగుల దూరంలో ఆగిపోయింది…