ఢిల్లీ కేపిటల్స్ జట్టులో కొవిడ్ కలకలం..

ఢిల్లీ కేపిటల్స్ జట్టులో కొవిడ్ కలకలం రేగింది. తమ తర్వాతి గేమ్ కోసం జట్టు సభ్యులు నేడు పూణె వెళ్లాల్సి ఉండగా రద్దు చేసుకుని క్వారంటైన్‌కే పరిమితమయ్యారు. ఆటగాళ్లకు నేడు, రేపు కరోనా టెస్టులు నిర్వహించనున్నారు. జట్టు ఫిజియో పాట్రిక్ ఫర్హాత్‌కు ఇటీవల కరోనా సంక్రమించడంతో ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లారు. తాజాగా ఆటగాళ్లకు నిర్వహించిన ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో ఓ ఆటగాడు, మసాజ్ చేసే వ్యక్తి ఒకరు కరోనా బారినపడినట్టు తేలింది. దీంతో వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఢిల్లీ శిబిరంలో కరోనా కలకలం నేపథ్యంలో బుధవారం (ఏప్రిల్ 20న) పంజాబ్ కింగ్స్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది. అయితే, షెడ్యూల్ మార్చే అవకాశం లేదని, యథాప్రకారమే మ్యాచ్ జరుగుతుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నెల 20, 22 తేదీల్లో ఢిల్లీ కేపిటల్స్ పూణెలో రెండు మ్యాచ్‌లు.. పంజాబ్, రాజస్థాన్ రాయల్స్‌తో ఆడాల్సి ఉంది.