గుజరాత్‌ టైటాన్స్‌కు అద్భుత విజయం….

శుభ్‌మన్‌ గిల్‌ సెంచరీ మిస్‌.. పంజాబ్‌పై గుజరాత్‌ గెలుపు...

పంజాబ్ కింగ్స్ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోరే సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో లివింగ్ స్టోన్ 64 పరుగులు చేయగా..శిఖర్ ధావన్ 35, జితేష్ శర్మ 23, షారుక్ ఖాన్ 15 పరుగులు చేశారు. ..

రాహుల్‌ తెవాటియా (3 బంతుల్లో 2 సిక్సర్లతో 13 నాటౌట్‌) గుజరాత్‌ టైటాన్స్‌కు అద్భుత ముగింపునిచ్చాడు. రెండు భారీ సిక్సర్లు బాది పంజాబ్‌ కింగ్స్‌కు కోలుకోలేని షాక్‌ ఇచ్చాడు. దీంతో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టైటాన్స్‌ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. అంతకుముందు శుభ్‌మన్‌ గిల్‌ (59 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 96) త్రుటిలో శతకాన్ని కోల్పోయాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్‌ (27 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 64) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ధవన్‌ (35), జితేశ్‌ (23) ఫర్వాలేదనిపించారు. రషీద్‌కు మూడు, దర్శన్‌ నల్కండేకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో గుజరాత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు చేసి గెలిచింది. సుదర్శన్‌ (35), హార్దిక్‌ (27), తెవాటియా విజయంలో భాగమయ్యారు. రబాడకు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా గిల్‌ నిలిచాడు…

ఉత్కంఠ పోరులో గుజరాత్‌ ఘన విజయం…

గుజరాత్‌ విజయానికి చివరి ఆరు బంతుల్లో 19 పరుగులు అవసరం కాగా.. అప్పటివరకు చక్కటి షాట్‌లతో ఆకట్టుకున్న గిల్‌ అంతకుముందు ఓవర్‌లోనే పెవిలియన్‌ చేరిపోయాడు. 20వ ఓవర్‌ వేసిన ఓడెన్‌ స్మిత్‌ తొలి బంతిని వైడ్‌గా వేయగా.. రెండో బంతికి అనూహ్య రీతిలో హార్దిక్‌ పాండ్యా రనౌటయ్యాడు. రెండో బంతికి సింగిల్‌ వచ్చింది. దీంతో సమీకరణం నాలుగు బంతుల్లో 17కు చేరింది. ఈ దశలో మూడో బంతికి మిల్లర్‌ ఫోర్‌ కొట్టగా.. నాలుగో బంతికి సింగిల్‌ వచ్చింది. ఇక మిగిలిన రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాదితేనే గుజరాత్‌ గెలుస్తుందన్న తరుణంలో తెవాటియా రెచ్చిపోయాడు. ఐదో బంతిని డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా బౌండ్రీ దాటించిన తెవాటియా.. చివరి బంతిని లాంగాన్‌ మీదుగా ప్రేక్షకుల్లో పడేసి మ్యాచ్‌కు అదిరిపోయే ముగింపు నిచ్చాడు…