ఆందోళనలు చేస్తే..ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే.. దైవానికి శత్రువే..!…. ఈ నిర్ణయంతో బహిరంగంగా హిజాబ్‌ను తగలబెట్టిన మహిళలు..!!.

తాజాగా ఇరాన్ ప్రభుత్వం కొత్త ఆదేశాలను జారీ చేసింది. హిజాబ్‌ ఆందోళనల్లో పాల్గొన్న నిరసనకారులపై విరుచుకుపడింది. ప్రభుత్వ భవనానికి నిప్పు పెట్టిన ఓ నిరసనకారుడికి అక్కడి న్యాయస్థానం మరణ శిక్షను విధించింది. మరో ఐదుగురికి 10 ఏళ్ల జైళ్లు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే దోషులుగా ఉన్నవారు తమ శిక్షపై అప్పీలు చేసుకోవచ్చని మాత్రం కాస్తా ఊరటనిచ్చింది. తాజాగా ఆ వివరాలను ఇరాన్‌ న్యాయ వ్యవస్థకు చెందిన మిజాన్‌ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో వెల్లడించారు. ప్రజా శాంతికి భంగం కలిగించి.. జాతీయ భద్రతకు ముప్పు కల్పించినట్టు నిరసనకారులపై ఆరోపణలు గుప్పించింది. ఆమేరకు నిరసనకారులను నేరస్థులుగా గుర్తించి… టెహ్రాన్‌ కోర్టు వారికి శిక్షలను విధించింది. ఇటీవల కొంత కాలంగా ఇరాన్‌ వ్యాప్తంగా హిజాబ్‌ నిరసనలు వెల్లువెత్తాయి. వేలాది మంది మహిళలు ఆందోళనకు దిగారు. హిజాబ్‌ను బహిరంగంగానే తగులబెట్టారు. మహ్‌సా అమినీ మృతిపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి…హిజాబ్‌ను సరిగ్గా ధరించలేదని మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతిని సెప్టెంబరు 16న పోలీసులు అరెస్టు చేశారు. ఆమె కస్టడీలో మృతి చెందడం ఇరాన్‌లో తీవ్ర దుమారం రేపింది. రెండు నెలలుగా హిజాబ్‌కు, పోలీసులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. అందులో భాగంగా మహిళలు తమ జట్టును కత్తిరించుకుంటున్నారు. అమిని మృతికి కారణమైన హిజాబ్‌ను వ్యతిరేకిస్తూ కాల్చేస్తున్నారు. అమినిని అరెస్టు చేసి హింసించిన మొరాలిటీ పోలీసులకు శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు వందల మందికి పైగా నిరసనకారులు చనిపోయారు. అమిని మృతి, ఆందోళనలపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. అమిని మృతిని ఖండించింది. ఈ ఘటనపై వెంటనే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని యూఎన్‌ డిమాండ్‌ చేసింది. ఆందోళనకారులపై దాడులను యూఎన్ మానవ హక్కుల విభాగం ఖండించింది. అంత జరిగినా.. ఇరాన్‌ ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. సరికదా నిరసనలను అణచివేసేందుకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. హింసాత్మక ఘటనల్లో పాల్గొనేవారికి తీవ్ర శిక్షలు ఉంటాయని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇటీవలే హెచ్చరించారు…