ఐరాస జనరల్‌ అసెంబ్లీ జరిగే కావెర్‌నోస్‌ హాల్‌లోకి డైనోసర్‌ వచ్చింది. ..!!!

అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి అనూహ్య అతిథి హాజరైంది.

ఐరాస జనరల్‌ అసెంబ్లీ జరిగే కావెర్‌నోస్‌ హాల్‌లోకి డైనోసర్‌ వచ్చింది.

దీంతో ఆ సమావేశంలో పాల్గొన్న ప్రపంచ నేతలు, పలు దేశాల దౌత్యవేత్తలు భయంతో ఉలిక్కిపడ్డారు.

అక్కడి నుంచి నేరుగా పోడియం వద్దకు వెళ్లిన ఆ డైనోసర్‌ మానవాళిని ఉద్దేశించి ప్రసంగించింది.

ఈ సందర్భంగా ప్రపంచంలో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆ జీవి.. ”వినాశనాన్ని ఎంచుకోకండి.. మానవజాతిని కాపాడుకోండి” అంటూ విజ్ఞప్తి చేసింది.

”వినండి ప్రజలారా..! వినాశనం అనేది చాలా చెడ్డ విషయం. అది మిమ్మల్ని (మానవాళిని ఉద్దేశిస్తూ) అంతరించిపోయేలా చేస్తుంది. ఈ 70 మిలియన్‌ సంవత్సరాల్లో నేను విన్న అత్యంత తెలివితక్కువ విషయం ఇదే. మీరు వాతావరణ విపత్తు వైపు వెళ్తున్నారు.

ఇంకా ప్రతి సంవత్సరం ప్రభుత్వాలు శిలాజ ఇంధనాల సబ్సిడీల కోసం ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నారు.

కానీ, ఆ మొత్తాన్ని ప్రపంచ వ్యాప్తంగా పేదరికంలో మగ్గిపోతున్న ప్రజలకు సాయంగా ఎందుకు ఉపయోగించట్లేదు..? వారికి సాయం చేయడం మరింత ఉత్తమం అని మీకు అనిపించలేదా? మీ జాతి వినాశనానికి ఎందుకు డబ్బులు ఖర్చు చేస్తున్నారో అర్థం కావట్లేదు.

ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు, మీ ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్మించుకునేందుకు మీకు గొప్ప అవకాశం లభించింది.

ఇది మానవాళికి గొప్ప అవకాశం. దానికి నాదో సలహా.. వినాశనాన్ని ఎంచుకోకండి. ఆలస్యం కాకముందే మీ జాతిని కాపాడుకోండి.

ఇకనైనా సాకులు చెప్పడం మాని.. మార్పులను ప్రారంభించాల్సిన సమయం ఇది.” అని డైనోసర్‌ సందేశమిచ్చింది.

అయితే ఇది నిజంగా జరగలేదు. వాతావరణ మార్పులపై ప్రపంచానికి అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్(యూన్‌డీపీ) చేసిన మాయ ఇది.

పర్యావరణ మార్పులపై ఐరాసలో సమావేశం జరగనున్న నేపథ్యంలో యూఎన్‌డీపీ.. ఈ షార్ట్‌ఫిల్మ్‌ను రూపొందించింది.

గ్రాఫిక్స్‌లో డిజైన్‌ చేసిన ఈ వీడియోలో డైనోసర్‌కు ప్రముఖ సెలబ్రిటీలు పలు భాషల్లో గాత్రం అందించారు.

ఈ వీడియోను ఐరాస తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేయగా.. విపరీతమైన ఆదరణ లభించింది. డైనోసర్‌ నిజంగా వచ్చి మాట్లాడినట్లుగా చూపించడం విశేషం