ప్రపంచ వేదికపై చైనాకు భారత్‌ కౌంటర్‌…

అంత‌ర్జాతీయ శాంతి భ‌ద్ర‌త‌లు, మిన‌హాయింపులు, నిర్వహ‌ణ‌, అస‌మాన‌త‌లు, సంఘ‌ర్ష‌ణ‌లు త‌దిత‌ర అంశాల‌పై ఐరాస‌లో చ‌ర్చ జ‌రిగింది. ఈ చ‌ర్చ‌లో భార‌త్ త‌ర‌పున కేంద్ర విదేశాంగ స‌హాయ‌మంత్రి డాక్ట‌ర్ రాజ్‌కుమార్ రంజ‌న్ సింగ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భందా ఆయ‌న కీల‌క ప్ర‌సంగం చేశారు. ప్ర‌పంచ దేశాలకు ఎల్ల‌ప్పుడు భార‌త్ అండ‌గా ఉంటుంద‌ని, ఆయా దేశాల ప్రాధాన్య‌త‌ల‌ను గౌర‌విస్తూ స‌హ‌క‌రిస్తామ‌ని అన్నారు. పొరుగు దేశం డ్రాగన్‌పై పరోక్షంగా విమర్శల వర్షం కురిపించారు. ‘‘పొరుగు దేశాలైనా, ఆఫ్రికన్‌ భాగస్వాములైనా లేదా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలైనా.. భారత్‌ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఆ దేశాలు మరింత దృఢంగా మారేందుకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తూనే ఉంటుంది. ఆయా దేశాల ప్రాధాన్యతలకు కూడా గౌరవమిస్తుంది. మేం అందించే సాయం.. డిమాండ్ ఆధారంగా ఉంటుంది. ఉపాధి కల్పన, సామర్థ్య నిర్మాణానికి దోహదం చేస్తుందే తప్ప ఆ దేశాలకు రుణాభారాలను సృష్టించదు’’ అంటూ చైనాను ఉద్దేశిస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు..చైనా తన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టును ఉపయోగించి దేశాలను రుణ ఊబిలోకి నెట్టేస్తోందని, తద్వారా ప్రాంతీయ ఆధిపత్యాన్ని చలాయించాలని చూస్తోందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. ఆసియా నుంచి ఆఫ్రికా వరకు పలు దేశాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పేరుతో చైనా భారీ మొత్తంలో డబ్బు వెచ్చిస్తోంది. ఈ బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టుపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ గతంలో అనేకసార్లు విమర్శలు గుప్పించారు. చైనా దోపిడీకి పాల్పడుతోందని, ప్రాజెక్టు కోసం పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేస్తూ చిన్న దేశాలను భారీ రుణ ఊబిలోకి నెట్టేస్తోందని ఆరోపించారు. ఇది ఆయా దేశాల సౌభ్రాతృత్వానికి ప్రమాదకరంగా మారుతోందని దుయ్యబట్టారు. తాజాగా ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ భారత్.. ఐరాస వేదికగా చైనాకు కౌంటర్‌ ఇచ్చింది…