ఢాకాలో ఇస్కాన్‌ టెంపుల్‌పై దాడి.. ధ్వంసం..

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఇస్కాన్‌ టెంపుల్‌పై దుండగులు దాడిచేసి కూల్చివేశారు. ఢాకాలోని లాల్ మోహన్ సాహా వీధిలో ఉన్న ఇస్కాన్ రాధాకాంత దేవాలయంపై సుమారు 200 మందికి పైగా వ్యక్తులు గురువారం దాడి చేసి ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఆలయాన్ని లూటీచేశారు. ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పలువురు గాయపడ్డారు. హాజీ షఫీవుల్లా నేతృత్వంలో ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు.
గతేడాది కొమిల్లా పట్టణంలో నవరాత్రుల సందర్భంగా దుర్గా మండపంలో ఖురాన్‌ను అపవిత్రం చేశారని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వెలువడ్డాయి. దీంతో జరిగిన అల్లర్లలో ముగ్గురు మృతిచెందారు. ఇలాంటి ఘటనలు గతంలో ఢాకాలోని టిప్పుసుల్తాన్‌ రోడ్‌లో, చిట్టగాంగ్‌లోని కొత్వాలీలో కూడా జరిగాయి.