ఇజ్రాయిల్‌కి అండగా ఉంటామన్న ప్రధాని మోడీ.. ప్రపంచ అగ్ర నేతల మద్దతు..

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య మళ్లీ కక్షలు భగ్గుమన్నాయి.చెప్పా పెట్టకుండా ఈ ఉదయం నుంచి పాలస్తీనా ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులు మొదలు పెట్టింది. దాదాపు 5000రాకెట్లు ఒకదాని తర్వాత ఒకటి దూసుకొచ్చి ఇజ్రాయెల్ పై పడటంతో ఆ ప్రాంతమంతా అగ్ని కీలలు అలుముకున్నాయి. పాలస్తీనా మిలిటెంట్లు హమాస్ గ్రూప్ ఈ చొరబాట్లకూ పాల్పడటంతో ఇజ్రాయెల్ బిత్తరపోయింది. ఊహించని ఈ దాడికి క్షణాల్లోనే తేరుకుని గట్టి కౌంటర్ ఇచ్చింది.అంతేకాదు దేశంలో యుద్ధ వాతవరణం ఉందన్న సంకేతాలను కూడా ప్రకటించింది.

అంతా 20 నిమిషాల వ్యవధిలోనే… Israel
ఈ రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉన్న వివాదాస్పద గాజా స్ట్రిప్ ను పాలస్తీనా దాడులకు వినియోగించుకుంది. జెరూ సలేం, టెల్ అవీవ్ సహా దేశ వ్యాప్తంగా ఎయిర్ రెడ్ సైరన్ల మోత మోగిపోయింది. కేవలం 20 నిమిషాల్లో వేలాది రాకెట్లు ఇజ్రాయెల్ పైకి దూసుకెళ్లాయి. హమాస్ తీవ్రవాదులు దేశంలో అనేక ఎంట్రీ పాయింట్ల దగ్గర చొరబాట్లకు పాల్పడుతున్నారని ఇజ్రాయెల్ మిలటరీ ప్రకటించింది. అప్రమత్తమైన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేత న్యాహు కార్యాలయం సెక్యూరిటీ చీఫ్ లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. హమాస్ తీవ్రవాదులకు చుక్కలు చూపిస్తామని.. హెచ్చరించారు. రష్యా ఉక్రెయిన్ పై దాడి తర్వాత ప్రపంచ భౌగోళిక వాతవరణంలో మరో అతిపెద్ద ఉద్రిక్తతలకు ఆస్కారమున్న వివాదంగా ఇది మారిపోయింది..

పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయిల్ పై భీకరదాడికి తెగబడింది. ఇప్పటికే పదుల సంఖ్యలో ఇజ్రాయిల్ పౌరులను కాల్చి చంపారు.పలువురిని మిలిటెంట్లు బందీలుగా పట్టుకున్నారు. మరోవైపు ఇజ్రాయిల్ సైన్యం గాజాపై ఎదురుదాడికి దిగింది. మిలిటెంట్లు, వారి స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే ప్రపంచ నేతలు ఇజ్రాయిల్ కి మద్దతు నిలుస్తున్నారు. తమను తాము రక్షించుకోవడం ఇజ్రాయిల్ సంపూర్ణ హక్కని ప్రపంచ నాయకులు ఆ దేశానికి మద్దతు తెలుపుతున్నారు.

ప్రధాని నరేంద్రమోడీ ఈ దాడుల్ని ఖండించారు. ”ఇజ్రాయిల్‌పై తీవ్రవాద దాడుల వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యానని, నా ఆలోచనలు, ప్రార్థనలు అమాయక బాధితులు, వారి కుటుంబాలతో ఉన్నాయి. ఈ క్లిష్ట సమయంలో మేము ఇజ్రాయిల్ కి సంఘీభావం ప్రకటిస్తున్నాం. ” అని పీఎం మోడీ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.ఇజ్రాయిల్ పౌరులపై ఈ ఉదయం హమాస్ ఉగ్రవాదులు జరిపి దాడులతో నేను షాక్‌కి గురయ్యాను. ఇజ్రాయిల్ తనను తాను రక్షించుకునే సంపూర్ణ హక్కు ఉంది. మేము ఇజ్రాయిల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాము.” అని యూకే ప్రధాని రిషి సునాక్ అన్నారు.