రేపు దండు మల్కాపూర్‌లో 51 పరిశ్రమలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌..

35వేల మందికి ఉపాధి..

ఉన్న ఊళ్లోనే ఉద్యోగం.. 35వేల మందికి కొలువు.. రేపు దండు మల్కాపూర్‌లో 51 పరిశ్రమలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

గ్రామీణ యువత ఉద్యోగాల కోసం నగరాలకు వలస వెళ్లకుండా ఉన్న ఊళ్లోనే వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం సాకారమవుతున్నది. మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్‌లో ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఎంఎస్‌ఎంఈ గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో 50కి పైగా పరిశ్రమలు ఉత్పత్తులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి.

మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్‌లో ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఎంఎస్‌ఎంఈ గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో 50కి పైగా పరిశ్రమలు ఉత్పత్తులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. ఆసియాలోనే అతిపెద్ద ఈ ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో మంగళవారం (ఈ నెల 6న) 51 పరిశ్రమలను మంత్రి కే తారకరామారావు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ పార్క్‌ ద్వారా సుమారు 35 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేయనున్న బొమ్మల తయారీ పార్క్‌తో తెలంగాణ రాష్ట్రం బొమ్మల తయారీ కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది.

గ్రామీణ యువతకు స్థానికంగా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని వికేంద్రీకరిస్తూ జిల్లాల్లో పారిశ్రామికవాడలను అభివృద్ధి చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే 2019లో తెలంగాణ పారిశ్రామికవేత్తల ఫెడరేషన్‌ (టీఐఎఫ్‌) ఆధ్వర్యంలో దండు మల్కాపూర్‌లో ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రియల్‌ పార్క్‌ను ఏర్పాటు చేసింది. 542 ఎకరాల్లో, మూడు దశల్లో అభివృద్ధి చేస్తున్న ఈ పార్క్‌లో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు కలుపుకొని 35 వేలమందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఈ పార్క్‌లో దాదాపు 51 పరిశ్రమలు ఉత్పత్తులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి.

ఇందులో ఎర్త్‌ డ్రిల్లింగ్‌ ఎక్విప్‌మెంట్‌, మైనింగ్‌, రక్షణ పరికరాల తయారీ, సోడా మిషన్‌ మేకింగ్‌, చాక్లెట్లు, బిస్కెట్లు, పచ్చళ్లు, కుర్‌కురే తదితర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ప్లాస్టిక్‌ కుర్చీలు, బిల్డింగ్‌ మెటీరియల్స్‌, ప్యాకింగ్‌ బ్యాగ్‌లు, టెక్ట్స్‌బుక్స్‌ ప్రింటింగ్‌, మిల్క్‌ క్యాన్ల తయారీ, కేబుల్స్‌ తయారీ, పేవ్‌మెంట్‌ టైల్స్‌, పేవ్‌మెంట్‌ టైల్స్‌ మౌల్డింగ్స్‌ తయారీ, ప్యాకింగ్‌ ప్రింటింగ్‌, కూలర్ల బాడీ తయారీ, పెట్రోల్‌ బంకుల నిర్మాణ పరిశ్రమ, ప్లాస్టిక్‌ బకెట్లు, ఆటోమేటిక్‌ రైస్‌ గ్రేడింగ్‌, ప్లాస్టిక్‌ ప్యాకింగ్‌ మెటీరియల్‌, ఇంజినీరింగ్‌, ఫ్యాబ్రికేషన్‌, యుపీవీసీ విం డోస్‌, సిమెంట్‌ బ్రిక్స్‌ తయారీ పరిశ్రమలు ఉన్నాయి.

ఎక్కువ ఉపాధి అవకాశాలు సృష్టించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తయారీ రంగంపై దృష్టి కేంద్రీకరించింది. చిన్నపిల్లల ఆట వస్తువులకు మార్కెట్‌లో గిరాకీ ఉండటంతో ప్రత్యేకంగా టాయ్స్‌పార్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎంఎస్‌ఎంఈ పార్క్‌లో ఏర్పాటు చేయనున్న టాయ్స్‌పార్క్‌లో చిన్నపిలలు, విద్యాబోధనకు ఉపయోగపడే ఆట వస్తువులు, బ్యాటరీ, ప్లాస్టిక్‌, కాటన్‌ తదితర బొమ్మల పరిశ్రమలు ఇక్కడ కొలువుదీరనున్నాయి. ప్రస్తుతం మన దేశంలో విక్రయిస్తున్న పిల్లల ఆట బొమ్మలలో 90% వరకు చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. తెలంగాణలో నిర్మల్‌ చెక్క బొమ్మల తయారీ పరిశ్రమను మినహాయిస్తే మిగిలిన బొమ్మలకు సంబంధించి రాష్ట్రంలో సుమారు 300 బొమ్మల దుకాణాలు కొనసాగుతున్నాయి.

వీరంతా ప్రస్తుతం నోయిడా, ముంబై, కర్ణాటక తదితర ప్రాంతాల్లోని హోల్‌సేల్‌ వ్యాపారుల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఈ బొమ్మలకు సుమారు రూ.100 కోట్లకు పైగా మార్కెట్‌ ఉన్నట్టు అంచనా. దండు మల్కాపూర్‌ టాయ్స్‌పార్క్‌లో సుమారు రూ.100 కోట్ల పెట్టుబడులు, 2,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఈ పరిశ్రమలన్నీ ఉత్పత్తి ప్రారంభిస్తే రాష్ట్రం బొమ్మల తయారీకి కేంద్రంగా మారనున్నది. బొమ్మల తయారీకి అవసరమైన ప్లాస్టిక్‌, కాటన్‌, చెక్క తదితర ముడిసరుకు తెలంగాణలో పుష్కలంగా ఉండటంతో మన రాష్ట్రంలో ఈ పరిశ్రమకు మంచి అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు.

దండు మల్కాపూర్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ను భవిష్యత్తులో మరింత విస్తరించాలనే ప్రణాళికలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న 542 ఎకరాలకు అదనంగా 1,863 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. 231 ఎకరాల్లో యాదాద్రి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్క్‌, 100 ఎకరాల్లో టాయ్‌పార్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టాయ్స్‌పార్క్‌ నిర్మాణానికి మాత్రం ఇప్పటికే ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయించింది. ఈ నెల 6న మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు.

ఈ పార్క్‌లో రూ.236 కోట్ల వ్యయంతో విద్యుత్తు సరఫరా, రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం కల్పించారు. ఇందులో 194 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో స్కూళ్లు, కమర్షియల్‌ మార్కెట్లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్లు, ఇతర సౌకర్యాలు కల్పించనున్నారు.

2.20 ఎకరాల విస్తీర్ణంలో కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ను నిర్మించారు. ఇందులో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, బాంకెట్‌ హాల్‌, ఆడిటోరియం, బ్యాంక్‌, రెస్టారెంట్‌, పరిశ్రమలకు సంబంధించిన వస్తువుల సూపర్‌మార్కెట్‌, పరిశ్రమల శాఖ కార్యాలయం, అకౌంటింగ్‌కు సంబంధించిన కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో వివిధ పరిశ్రమలకు అవరమైన నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.