మన ఇతిహాసాలు ..అదితి… దితి ల కథ తెలుసా?…

మన ఇతిహాసాలు ..అదితి… దితి ల కథ తెలుసా?.

అదితి, దితి, వినత, కద్రువ అనే నలుగురూ కశ్యపుని భార్యలు. అదితి ధరణీదక్షుల కుమార్తె. వినయవిధేయతలతో, ప్రేమానురాగాలతో భర్తను సేవిస్తూ వుండేది. కశ్యపుడు సంతోషించి అదితిని ఏదైనా వరం కోరుకోమన్నాడు. “ముద్దుల మూట కట్టేవాడూ, బుద్ధిమంతుడూ, విద్యావంతుడూ, తేజశ్శాలీ అయిన కొడుకు కావాలి నాకు’ అని అడిగింది అదితి. కశ్యపుడు సరేనన్నాడు. ఆ విధంగా అదితి కడుపున ఇంద్రుడు జన్మించాడు. అది చూసి దితి ఓర్వలేకపోయింది. అసూయతో రగిలిపోయి కశ్యపుడి దగ్గరకు వెళ్ళి ‘నాకూ ఇంద్రుడులాంటి కొడుకే కావాలి’ అని పట్టుబట్టింది. కశ్యపుడు దితి అభ్యర్ధనను కూడా మన్నించాడు. దితి గర్భవతి అయింది. నెలలు నిండాయి. అదితికి గుండెల్లో గుబులు మొదలయింది. ఒకరోజు, కొడుకుని చాటుగా పిలిచి ‘దితికి కూడా నీతో సమానమైనవాడు కలిగితే వాడు నీకు శత్రువవుతాడు. కాబట్టి అలాంటివాడు అసలు పుట్టకుండానే చూడాలి’ అని చెప్పింది. ఇంద్రుడు తల్లి చెప్పినదంతా విని తనకు శత్రువు పుట్టకుండా చేసుకోవాలనుకుని మెల్లగా మారుతల్లి దగ్గరకు వెళ్ళి ‘అమ్మా నీకు దాసుడనై పరిచర్యలు చేద్దామని వచ్చాను” అని వినయంగా చెప్పాడు.

కొడుకు వినయభక్తికి దితి సంతోషించి వాణ్ణి దగ్గరకు తీసుకుని ముద్దాడి ‘అలాగే చేద్దువులే’ అంది. అప్పటినుంచి మారుతల్లికి సేవలు చేస్తూ ఆమె దగ్గరే ఎక్కువసేపు గడిపేవాడు. దితికి కూడా ఇంద్రుడిమీద విశ్వాసం ఎక్కువైంది. అదే అదనుగా ఒకరోజు ఆమె గర్భంలో ప్రవేశించి తన వజ్రాయుధంతో మారుతల్లి గర్భంలోని పిండాన్ని నలభై తొమ్మిది ముక్కలు చేశాడు. అవన్నీ పెద్దగా ఏడ్చాయి. ఆ ఏడుపు విని దితికి మెలుకువ వచ్చింది. తన కడుపులోని బిడ్డను చంపవద్దని ప్రార్ధించింది. ఇంద్రుడు దితి గర్భంనుంచి బయటకు వచ్చి “శత్రువును ఏ విధంగానైనా చంపవచ్చు గాబట్టి, నీకు తెలియకుండా నీ గర్భంలోకి ప్రవేశించాను” అని చెప్పి, తను చేసిన పనికి క్షమించమని వేడుకున్నాడు. దితి ఆ శకలాలను ఇంద్రుడికే ఇచ్చి వీళ్ళను రక్షించే బాధ్యత నీదే అంది.

వాళ్ళే మరుత్తులు,

వాళ్ళే దేవతలయ్యాడు.

అదితి ప్రోద్బలంతోనే ఇంద్రుడు తన కడుపులోని బిడ్డను తునాతునకలు చేసాడని తెలుసుకుని కోపంతో మండిపడుతూ ‘నీ కొడుకు చేసిన దుర్మార్గానికి నువ్వే కారణం. నీ కొడుకు త్రిలోకాధిపత్యం కోల్పోతాడు. నువ్వు కారాగారంలో మగ్గుతూ బిడ్డలకోసం అలమటిస్తూ బతుకుతావు. నీ పిల్లలు పుట్టీపుట్టగానే మరణిస్తారు. ఏడుగర్భాలు నీకు శోక కారణమవుతాయి’ అని తీవ్రంగా శపించింది దితి. ఆ శాపం వల్లనే ఇంద్రుడు ఒకసారి నహుషుడి చేతిలో ఓడి దేవలోకానికి దూరమై అజ్ఞాతంలో కొన్నాళ్ళు గడిపాడు. అప్పుడే నహుషుడు దేవేంద్ర పదవిని అలంకరించాడు. ద్వాపరయుగంలో అదితికి పుట్టిన ఆరుగురు కుమారుల్ని ఆమె అన్న కంసుడు చంపేశాడు. ఏడవ గర్భం చ్యుతం అయింది. అలా ఆమెకు ఏడు సార్లు గర్భశోకం కలిగింది.