చంద్రబాబుకు కుప్పంలో గెలవలేనన్న భయం..జగన్

తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఏపీ సీఎం జగన్‌ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెదేపా.. తెలుగు బూతుల పార్టీ, జనసేన..రౌడీసేన అని విమర్శించారు. గత పాలనలో ప్రజలంతా ఇదేం ఖర్మరా అనుకోబట్టే 2019లో దత్తపుత్రుడు, సొంతపుత్రుడిని ప్రజలు ఓడించి బైబై చెప్పారని వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగసభలో జగన్‌ మాట్లాడారు.

”మనం చేసిన ఇంటింటా అభివృద్ధికి అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాలు అండగా నిలిచాయి. అందుకే రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైకాపా, మనందరి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు. చివరికి కుప్పంలోనూ తెదేపాను చిత్తుగా ఓడించారు. అందుకే చంద్రబాబు ఇదేం ఖర్మరా బాబు అని తలపట్టుకుని కూర్చుంటే.. ఆయన దత్తపుత్రుడు బాబుతో ఇదేం ఖర్మరా అనుకుంటున్నారు. ఇలాంటి వారు రాజకీయాల్లో ఉండటం ఇదేం ఖర్మరా అని ప్రజలు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే సరేసరి.. లేదంటే అవే తనకు చివరి ఎన్నికలు అని ప్రజల్ని చంద్రబాబు బెదిరిస్తున్నారు. కుప్పంలో గెలవలేనన్న భయం, నిరాశ, నిస్పృహ ఆయనలో కనిపిస్తున్నాయి” అని సీఎం వ్యాఖ్యానించారు.