టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు జగ్గారెడ్డి..

తెలంగాణ కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి తన ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉన్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న జగ్గారెడ్డి తాజాగా సీఎల్పీ భేటీ నుంచి అర్ధాంతరంగా బయటకొచ్చారు. పార్టీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ప్రస్తావించేందుకు భేటీలో అవకాశం ఇవ్వకపోవడంతో జగ్గారెడ్డి కోపం వచ్చింది… దీంతో సమావేశం మధ్యలోనే ఆయన బయటకొచ్చారు. సోమవారం (మార్చి 7) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో.. సభలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించేందుకు ఇవాళ సీఎల్పీ భేటీ అయింది. హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్ హోటల్‌లో ఈ భేటీ జరిగింది. సీఎల్పీ భేటీకి కొద్ది గంటల ముందు జగ్గారెడ్డి మీడియా సమావేశానికి సిద్ధపడగా కాంగ్రెస్ పెద్దలు వారించడంతో ప్రెస్ మీట్‌ను విరమించుకున్నారు. ఆ తర్వాత నేరుగా తాజ్ డెక్కన్ హోటల్‌కు వెళ్లిన ఆయన.. అక్కడ అరగంట పాటు ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ పాటించడం లేదని జగ్గారెడ్డి ఆయనపై ఫైర్ అయ్యారు. మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి.. స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకెదురైన చేదు అనుభవాన్ని చెప్పుకునే అవకాశం ఇవ్వనప్పుడు సీఎల్పీ భేటీలో ఉండటమెందుకని బయటకొచ్చేసినట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని..ఎమ్మెల్యేగా అది తన హక్కు అని పేర్కొన్నారు.