కశ్మీర్‌లో పాక్‌కు చెందిన కీలక ఉగ్రవాది హతం….

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. పాక్‌కు చెందిన కీలక ఉగ్రవాది హతం

R9TELUGUNEWS.COM: జమ్మూ-కశ్మీర్‌లోని పూంచ్-రాజౌరీ సెక్టార్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు యత్నిస్తోన్న కీలక ఉగ్రవాది అబు జరారాను భద్రతాదళాలు మంగళవారం మట్టుబెట్టాయి. నిఘావర్గాల సమాచారంతో బెహ్రామ్‌గాలా ప్రాంతంలో కశ్మీర్‌ పోలీసులు, సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో అతడు హతమయ్యాడు. ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపి తప్పించుకునేందుకు యత్నించారని.. కానీ, ఎదురు కాల్పుల్లో జరారా మృతి చెందాడని, మరొకరు తప్పించుకున్నారని ఓ డిఫెన్స్‌ అధికారి వెల్లడించారు. మృతి చెందిన ఉగ్రవాది వద్ద నుంచి ఒక ఏకే- 47 రైఫిల్, నాలుగు మ్యాగజైన్లు, ఒక గ్రెనేడ్, కొంత నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తప్పించుకున్న ఉగ్రవాదినీ పట్టుకునేందుకు తనిఖీలు ముమ్మరం చేశామన్నారు.

‘భద్రతా దళాలకు పెద్ద విజయం’

పూంచ్-రాజౌరీ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి హతమైన ఎనిమిదో ఉగ్రవాది జరారా అని అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్‌కు చెందిన ఇతను లష్కరే తొయిబా ఉగ్రవాది అని చెప్పారు. కశ్మీర్‌లోని పిర్‌ పంజల్‌ దక్షిణ ప్రాంతంలో స్థానిక యువతను మిలిటెన్సీ వైపు ఆకర్షించడం, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం వంటి బాధ్యతలు అతనికి అప్పగించినట్లు తెలుస్తోందన్నారు. భద్రతా బలగాలపైనా పెద్దఎత్తున దాడులు నిర్వహించే పనిలో ఉన్నట్లు తెలిపారు. అతన్ని అంతమొందించడం భద్రతా దళాలకు పెద్ద విజయమని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.