ఒకే దేశం- ఒకే ఎన్నిక’కు జనసేన మద్దతు: నాదెండ్ల మనోహర్‌.

మంగళగిరి.. ఒకే దేశం- ఒకే ఎన్నిక విధానానికి తమ పార్టీ మద్దతిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడతూ..

ఈ అంశంపై భాజపా పెద్దలు పవన్‌ కల్యాణ్‌తో ఇప్పటికే చర్చించారన్నారు. దీనిపై మరింత లోతైన చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ఈ విధానంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పిన మనోహర్‌.. ఎన్నికల సమయంలో తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

ఈనెల 2న పవన్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సేవా కార్యాక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం, భవన నిర్మాణ కార్మికులతో కలసి సహపంక్తి భోజనం, రెల్లి కాలనీ వాసుల మధ్య పుట్టిన రోజు వేడుకలు, ఎస్సీ బాలుర వసతి గృహాలలో పెన్నులు, నోట్ బుక్స్ పంపిణీ, ప్రభుత్వ సహాయం అందని విభిన్న ప్రతిభా వంతులను దత్తత తీసుకొని వారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతున్నామన్నారు..

జమిలి ఎన్నికలపై వైసీపీ ఎంపీ బెలాన్ల చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముందస్తు ఎన్నికలు వచ్చే పరిస్థితులున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంటరీ సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. జమిలి ఎన్నికలకు వెళ్లే యోచనలో కేంద్రప్రభుత్వం ఉందని చంద్రశేఖర్ చెప్పారు. జమిలి ఎన్నికలను చాలా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. అయినా సరే ముందస్తు ఎన్నికలకు సమాయాత్తం కావాలని వైసీపీ నేతలకు ఎంపీ బెలాన్ల చంద్రశేఖర్ సూచించారు.