భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదు.జర్మనీ తీరుపై భారత్ వార్నింగ్..!

లిక్కర్ పాలసీ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) అరెస్టుపై జర్మనీ చేసిన కామెంట్లను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఘాటుగా స్పందించింది..భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగదని పేర్కొంది. “కేసు విచారణ పారదర్శకంగా జరగాలి. భారత్ ప్రజాస్వామ్య దేశం. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ న్యాయపరమైన, నిష్పాక్షికమైన విచారణకు అర్హులు, అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలను ఎలాంటి పరిమితులు లేకుండా ఆయన ఉపయోగించుకోవచ్చు” అని జర్మన్ ఎంబసీ డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్, జార్జ్ ఎంజ్వీలర్ చేసిన ప్రకటన దుమారం రేపింది.

దీనిపై స్పందించిన భారత్ జర్మనీ తీరుపై మండిపడింది. దిల్లీలోని జర్మనీ రాయబారిని కేంద్రం పిలిచి నిలదీసింది. తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించింది. కాగా దిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి అరెస్టు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పంపిన తొమ్మిది సమన్లను పట్టించుకోకపోవడంతో సీఎం ను అరెస్టు చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి తరలించారు..కేజ్రీవాల్ అరెస్టుతో దేశ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. అయితే దిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయరని జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని ఆప్ నేతలు వెల్లడించారు. నైతిక కారణాలతో కేజ్రీవాల్ తక్షణమే రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం గమనార్హం..