జేఈఈ మెయిన్ 2022కు రిజిస్ట్రేషన్ రేపటితో ఆఖరు..

జేఈఈ మెయిన్ 2022కు రిజిస్ట్రేషన్‌ రేపటితో ఆఖరు..

జేఈఈ మెయిన్ 2022 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు ఇక ఒక్క రోజే మిగిలుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్ధులెవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఏ ఈ సందర్భంగా సూచించింది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్టీఏ విడుదల చేసిన జేఈఈ మెయిన్‌ 2022 నోటిఫికేషన్‌ ప్రకారం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మార్చి 31 సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. ఫీజు చెల్లింపులు అదే రోజు రాత్రి11 గంటల 30 నిముషాల వరకు అందుబాటులో ఉంటుంది. ఇక ఈ పరీక్షకు సంబంధించిన తేదీల విషయంలో దేశ వ్యాప్తంగా పలు చర్చలు కూడా జరిగాయి. ఎట్టకేలకు జేఈఈ మెయిన్‌ కొత్త తేదీలు వెలువడినప్పటికీ పలు రాష్ట్రాల్లోని బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులకు ఆయా తేదీలు అడ్డుగా ఉండటంతో ఇంటర్‌, టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల షెడ్యుళ్లను కూడా మార్చి కొత్త టైం టేబుళ్లను విడుదల చేశాయి. జేఈఈ మెయిన్ – 2022 ఏప్రిల్‌ సెషన్‌కు సంబంధించిన కొత్త తేదీలు (JEE Main 2022 revised exam dates).. ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 రోజుల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్ – 2022 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి వయోపరిమితి లేదు. అలాగే 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ మొదటి సెషన్‌కు సంబంధించిన హాల్‌ టికెట్లు తర్వలో విడుదలకానున్నాయి.