ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్థాన్‌ కూడా ఒకటి…అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక వ్యాఖ్యలు..!!.

ప్రపంచంలో అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్థాన్‌ ఒకటి...!!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాల్లో(Dangerous Nations) పాకిస్థాన్‌ ఒకటి అని ఆయన అన్నారు. ఆ దేశం వద్ద ఉన్న అణ్వాయుధాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన డెమోక్రటిక్‌ పార్టీ సమావేశంలో బైడెన్‌ ఈ కామెంట్‌ చేశారు. ఆ సమావేశంలో చైనా, రష్యా తీరును కూడా ఆయన ఖండించారు. చైనా, రష్యాతో ఉన్న విదేశాంగ విధానంపై మాట్లాడుతున్న సమయంలో పాక్‌పై బైడెన్‌ ఆ వ్యాఖ్యలు చేశారు… డెమోక్రటిక్‌ పార్టీ ఈవెంట్‌లో బైడెన్‌ చేసిన వ్యాఖ్యలను వైట్‌హౌజ్‌ ప్రెస్‌ రిలీజ్‌ ద్వారా వెల్లడించారు. బైడెన్‌ వ్యాఖ్యల వల్ల పాక్‌ పరిస్థితి దయనీయంగా మారింది. అమెరికాతో సంబంధాలను బలపరుచుకోవాలని షెబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఆ వ్యాఖ్యలు పాక్‌కు శాపంగా మారనున్నాయి. 21వ శతాబ్ధం రెండవ క్వార్టర్‌లో అమెరికాను డైనమిక్‌గా మార్చేందుకు అనేక అవకాశాలు ఉన్నట్లు బైడెన్‌ తెలిపారు.
ఇటీవల నేషనల్‌ సెక్యూర్టీ స్ట్రాటజీకి చెందిన డాక్యుమెంట్‌ను రిలీజ్‌ చేశారు. 48 పేజీలు ఉన్న ఆ డాక్యుమెంట్‌లో పాకిస్థాన్‌ గురించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు. చైనా, రష్యా వల్ల అమెరికాకు ప్రమాదం పొంచి ఉన్నట్లు ఆ డాక్యుమెంట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.