ఆర్మీ ఎంపిక పరీక్షకు సింగరేణి వ్యాప్తంగా 11 చోట్ల శిక్షణ శిబిరాలు…

ఆర్మీ ఎంపిక పరీక్షకు సింగరేణి వ్యాప్తంగా 11 చోట్ల శిక్షణ శిబిరాలు💥

550 మందికి 45 రోజుల పాటు ఉచిత శిక్షణ

ఈ నెల 20వ తేదీ లోపు ఏరియాలలో ఎంపిక పరీక్షలు

గత ఏడాది రిక్రూట్‌ మెంట్‌ లో 35 మంది ఎంపిక

👉ఆర్మీ రిక్రూట్‌ మెంట్‌ విభాగం (సికింద్రాబాద్‌) వారు వచ్చే మార్చి నెల 5వ తేదీ నుండి ఆర్మీ రిక్రూట్‌ మెంట్‌ ను నిర్వహించనున్న నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం సింగరేణి ప్రాంతంలోని ఆసక్తి గల సింగరేణీ యువతకు ఈ ర్యాలీ ద్వారా ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో ప్రి-ఆర్మీ రిక్రూట్‌ మెంట్‌ శిక్షణా శిబిరాలను ఈ నెల 20వ తేదీ నుండి నిర్వహించాలని నిర్ణయించింది.

👉 సి&ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌ ఆదేశాల మేరకు సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా గల 11 ఏరియాల్లో ప్రత్యేక శిక్షణా శిబిరాలను నిర్వహించబోతున్నారు. ఆర్మీపై ఆసక్తి గల సింగరేణి కార్మికుల బిడ్డలు, మాజీ కార్మికుల పిల్లలు, ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలు, సమీప గ్రామాలు, కోల్‌ బెల్ట్‌ ఏరియాలకు చెందిన యువకులు ఎవరైనా సరే ఈ ప్రి-ఆర్మీ రిక్రూట్‌ మెంట్‌ శిక్షణా శిబిరంలో పాల్గొని శిక్షణ పొందవచ్చని సింగరేణి సేవా సమితి ఉపాధ్యక్షులు, జనరల్‌మేనేజర్‌ (కో-ఆర్డినేషన్‌ మరియు మార్కెటింగ్‌) శ్రీ కె.రవిశంకర్‌ ఒక ప్రకటనలో తెలియజేశారు.

👉 సింగరేణి సంస్థ విస్తరించి ఉన్న ఆరు తెలంగాణా జిల్లాల్లోని 11 ఏరియాలల్లో ఈ శిక్షణా శిబిరాలను నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు ఏరియాల్లో, భూపాలపల్లి జిల్లా కేంద్రంలో, పెద్దపల్లి జిల్లాలో రామగుండం-1 (గోదావరిఖని), రామగుండం-2 (8 ఇంక్లైన్‌ కాలనీ), రామగుండం-3 (సెంటినరీ కాలనీ) ల్లో, మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్‌ లో, కోమరం భీం అసిఫాభాద్‌ జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలో ఈ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ క్యాంపుల్లో చేర్చుకొనేందుకు ప్రతీ ఏరియాలో 20వ తేదీ లోపు ప్రాధమిక ఎంపిక పరీక్షలను నిర్వహిస్తున్నారు.

👉 18 నుండి 21 మధ్య వయసు గల యువకులు, 162 నుండి 166 సెంటి మీటర్ల ఎత్తు, 48 నుండి 55 కేజీల బరువు కల్గి 1600 మీటర్ల దూరాన్ని 7 నిమిషాల్లో పరిగెత్త గలిగే సామర్థ్యం గలిగి ఉంటే వారిని శిక్షణా శిబిరం కోసం ఎంపిక చేస్తారు. ప్రతీ ఏరియా నుండి 50 మందిని ఎంపిక చేసి వారికి రోజూ ఉదయం పూట 6 గంటల నుండి 9 గంటల వరకు శారీరక ధారుడ్య పరీక్షల్లో నెగ్గడానికి కావాల్సిన శిక్షణను ఇవ్వనున్నారు. ఆర్మీ ఎంపికకు తగిన విధంగా శిక్షణ ఇవ్వడానికి సరైన అనుభవం కలిగిన వ్యక్తులను యాజమాన్యం నియమిస్తోంది. శిక్షణ కాలంలో యువకులకు పౌష్టిక అల్పాహారంగా కోడిగుడ్లు, పాలు, పండ్లు కూడా ఉచితంగా అందజేయనుంది.

ఇప్పటికే వందలాది మందికి ఉద్యోగాలు

👉 సింగరేణి ఆధ్వర్యంలో 2001 సంవత్సరం నుండి ఇప్పటి వరకూ ప్రతీ ఏడాది ఈ విధంగా నిర్వహించిన ఉచిత ఆర్మీ శిక్షణా శిబిరాల వలన వందలాది మంది సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువకులు ఆర్మీలో ఉద్యోగాలు పొందారు. దేశం నలుమూలల, సరిహద్దు ప్రాంతాల్లో కూడా వీరు విధులు నిర్వహిస్తున్నారు.

👉గత ఏడాది ఆర్మీ రిక్రూట్‌ మెంట్‌ ర్యాలీలో ఎక్కువ మంది యువతకు ఎంపిక అవకాశం కలిగేలా చూడాలని కంపెనీ ప్రయోగాత్మకంగా రెసిడెన్షియల్‌ పద్ధతిలో ఆర్మీ శిక్షణా శిబిరాలను 3 చోట్ల నిర్వహించింది. 11 ఏరియాల్లో స్క్రీనింగ్‌ నిర్వహించి కొత్తగూడెం, రామగుండం-2, శ్రీరాంపూర్‌ ఏరియాలలో రెసిడెన్షియల్‌ క్యాంపులను 3 నెలల పాటు నిర్వహించి 329 మంది యువతకు శిక్షణ ఇచ్చింది. కరీంనగర్‌ లో జరిగిన ఆర్మీ రిక్రూట్‌ మెంట్‌ ర్యాలీలో 272 మంది పాల్గొనగా వీరిలో 162 మంది శారీరక ధారుడ్య పరీక్షలో ఉతీర్ణులవడం విశేషం. కాగా ఆ తర్వాత జరిగిన మెడికల్‌ పరీక్షలో 114 మంది ఉతీర్ణులు కాగా ఫైనల్‌ రాత పరీక్షలో 35 మంది పాసై ఆర్మీలో ఉద్యోగాలు పొందారు. ఒక ఏడాదిలో ఇంత పెద్ద సంఖ్యలో సింగరేణి ప్రాంత యువకులు ఉద్యోగాలు పొందడం ఇదే తొలిసారి. అయితే ఈ ఏడాది కోవిడ్‌ నిబంధనలు అమలులో ఉన్నందున రెసిడెన్షియల్‌ తరహాలో శిక్షణను ఇవ్వడం లేదనీ, ఏరియాల వారీగా అన్ని చోట్ల శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నామని సింగరేణి స్థాయి సేవా సమితి కో-ఆర్డినేటింగ్‌ అధికారి, సింగరేణి సంస్థ చీఫ్‌ లైజన్‌ ఆఫీసర్‌ శ్రీ బి.మహేష్‌ తెలియజేశారు.

ఆసక్తి గల నిరుద్యోగ యువతకి ఇది ఒక మంచి అవకాశం

👉ఆర్మీలో చేరాలి అనుకొనే వారికి ఇది ఒక మంచి అవకాశం. ప్రైవేటు ఆర్మీ శిక్షణా శిబిరాలలో పెద్ద ఎత్తున ఫీజు వసూలు చేస్తున్నారు. కానీ సింగరేణి సంస్థ సామాజిక బాధ్యత కార్యక్రమాలలో భాగంగా సింగరేణి ప్రాంత యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఉచితంగా ఈ క్యాంపులను నిర్వహిస్తోంది. శారీర ధారుడ్య పరీక్షకు అవసరమైన శిక్షణ ఇప్పించడంతో పాటు రాత పరీక్షకు కూడా ఉచిత శిక్షణ ఇవ్వనుంది.

👉 సింగరేణి కార్మికుల బిడ్డలే కాక సింగరేణి ప్రాంతాలకు సంబంధించిన యువకులు ఎవరైనా సరే ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవచ్చని సింగరేణి యాజమాన్యం పిలుపునిస్తోంది. ఈ విషయంపై సింగరేణి ప్రాంతాల్లోని జి.ఎం. కార్యాలయాల్లో పర్సనల్‌ విభాగంలో సంప్రదించవచ్చని తెలిపింది.

 చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్