కొత్త వైద్య కళాశాలల్లో 200 వైద్యుల పోస్టుల భర్తీ..

కొత్త వైద్య కళాశాలల్లో 200 వైద్యుల పోస్టుల భర్తీ..
R9TELUGUNEWS.com
తెలంగాణలోని వనపర్తి, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, మంచిర్యాల, రామగుండంలలో కొత్తగా నెలకొల్పనున్న వైద్య కళాశాలల్లో 200 వైద్యుల పోస్టులను భర్తీచేయడానికి వైద్య విద్య సంచాలకుల కార్యాలయం నియామక ప్రకటన వెలువరించింది. తాత్కాలిక ప్రాతిపదికన ఏడాది ఒప్పందంతో సేవలందించేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు.. ఆచార్యులు, సహ ఆచార్యులు, సహాయ ఆచార్యుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఆ ప్రకటనలో కోరింది. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, కమ్యూనిటీ మెడిసిన్‌, జనరల్‌ మెడిసిన్‌, డెర్మటాలజీ, సైకియాట్రీ, ఆర్థోపెడిక్స్‌, అనస్థిషియాలజీ, రేడియోడయోగ్నసిస్‌, ఎమర్జెన్సీ మెడిసిన్‌ తదితర విభాగాల్లో పోస్టులున్నాయి. అభ్యర్థులు ఈ నెల 28వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అర్హుల తుది జాబితాను 31న ప్రకటిస్తారు. ఎంపికైన వారు నిర్దేశిత కళాశాలల్లో వచ్చేనెల 7వ తేదీలోగా చేరాల్సి ఉంటుంది. ‘‘ఆచార్యులకు నెలకు రూ.1.90 లక్షలు, సహ ఆచార్యులకు రూ.1.50 లక్షలు, సహాయ ఆచార్యులకు రూ.1.25 లక్షలు వేతనంగా చెల్లిస్తాం. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాల్లో చేరిన వారికి అదనంగా మరో రూ.50 వేలు ప్రోత్సాహకంగా ఇస్తాం’ అని వైద్యవిద్య సంచాలకులు రమేశ్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. త్వరలోనే రెగ్యులర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియనూ ప్రారంభిస్తామన్నారు….