ఆర్థిక సాయానికి జర్నలిస్టుల కుటుంబాల నుంచి దరఖాస్తుల ఆహ్వానం…

సంక్షేమ నిధి ద్వారా ఆర్థిక సహాయం కోసం మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సూచించారు. దరఖాస్తులు నిర్ణీత నమూనాలో పూర్తి చేసి, సంబంధిత డీపీఆర్‌వో ద్వారా ధ్రువీకరించాలని, దరఖాస్తుతో పాటు డెత్‌ సర్టిఫికెట్‌, ఆదాయ, కుటుంబ ధ్రువీకరణ పత్రం, జర్నలిస్టు గుర్తింపు కార్డును జతచేయాలన్నారు.ప్రమాదం బారినపడి, అనారోగ్య కారణాలతో పని చేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులు సైతం సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తుతో ప్రభుత్వ సివిల్‌ సర్జన్‌ ఇచ్చిన ‘జర్నలిస్టు పని చేసే స్థితిలో లేడు’ (INCAPACITATION) సర్టిఫికేట్, ఆదాయం, జర్నలిస్టు గుర్తింపు కార్డు వివరాలతో దరఖాస్తును డీపీఆర్‌ ద్వారా ధ్రువీకరించాలన్నారు. గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇప్పటికే మీడియా అకాడమీ నుంచి లబ్ధి పొందిన, పెన్షన్ పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులని చెప్పారు.

దరఖాస్తులను ఈ నెల 21లోగా కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, ఇంటి.నం.10-2-1, ఎఫ్‌డీసీ కాంప్లెక్స్‌, 2వ అంతస్థు, సమాచార భవన్, మాసబ్‌ ట్యాంక్‌, హైదరాబాద్‌– 500028 చిరునామాకు పంపాలన్నారు. కమిటీ దరఖాస్తులను పరిశీలించి.. ఆర్థిక సాయాన్ని అందజేస్తుందని తెలిపారు. ఇతర వివరాల కోసం 7702526489 నంబరులో కార్యాలయ అధికారిని సంప్రదించాలని సూచించారు.