జర్నలిస్టును, కెమెరా మెన్‌ను చెడ్డీపై నిలబెట్టిన సీఐ.. ఓ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది…

పోలీస్‌ స్టేషన్‌ ముందు కొందరు నిరసన తెలుపుతున్నారు. దానిని కవర్‌ చేయడానికి ఓ యూట్యూబ్‌ జర్నలిస్ట్‌ తన కెమెరామెన్‌తో కలిసి అక్కడి వెళ్లాడు. నిరసనకు గల కారణాలు తెలుసుకుంటుండగా.. పోలీసులు వచ్చి అందరినీ అరెస్టు చేశారు. తమకు వ్యతిరేకంగా కార్యక్రమం నిర్వహిస్తారా అని స్టేషన్‌లోకి తీసుకెళ్లి వారిని చెడ్డీలపై నిలబెట్టారు. ఆ సమయంలో తీసిన ఓ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. విషయం కాస్తా బజారున పడటంతో స్టేషన్‌ ఆఫీసర్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు..మధ్యప్రదేశ్‌లోని అధికార బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు గురు దత్‌ శుక్లా.. అనురాగ్‌ మిశ్రా అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో తనను బెదిరిస్తున్నాడని సిద్ధి కొత్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసిన పోలీసులు విచారణలో భాగంగా నీరజ్‌ కుందర్‌ అనే థియేటర్‌ ఆర్టిస్టును అరెస్టు చేశారు. అయితే అతని అరెస్టుకు వ్యతిరేకంగా ఇంద్రావతీ నాట్య సమితికి చెందిన పలువురు సభ్యులు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నిరసనకు దిగారు. దీంతో విషయం తెలుసుకున్న కనిష్క్‌ తివారీ అనే యూట్యూబ్‌ జర్నలిస్టు తన కెమెరా మెన్‌తో కలిసి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నాడు. నిరసనకారుల వద్ద సమాచారం సేకరిస్తున్నాడు.

దీంతో ఆగ్రహానికి లోనైన స్టేషన్‌ ఆఫీసర్‌ మనోజ్‌ సోనీ అందరినీ అరెస్ట్‌ చేశాడు. అంతటితో ఆగకుండా నిరసనకారులతోపాటు జర్నలిస్టును, కెమెరా మెన్‌ను బట్టలు తీసేయించి చెడ్డీలపై స్టేషన్‌లో నిలబెట్టాడు. ఆ సమయంలో తీసిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతున్నది. దీంతో జర్నలిస్టు పట్ల అమర్యాదగా ప్రవర్తించిన సీఐపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అధికారులను ఆదేశించారు. దీంతో భోపాల్‌ ఏఎస్పీ ఆ సీఐని విధుల నుంచి సస్పెండ్‌ చేశారు.