జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో.. పోలీసుల కీలక నిర్ణయం..!!!

జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిందితులైన ఐదుగురు మైనర్లను విచారణ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జూబ్లీహిల్స్ పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డును కోరే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రస్థాయి నేరాలకు పాల్పడిన మైనర్లను చట్ట ప్రకారం మేజర్లుగా పరిగణించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు 2015లో జువైనల్ జస్టిస్ చట్టానికి చేసిన చట్ట సవరణను జువైనల్ జస్టిస్ బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు.2019లో చాంద్రాయణగుట్టలో పదేళ్ల బాలుడిపై అసహజ లైంగిక దాడి చేసిన 17 ఏళ్ల బాలుడికి జువైనల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో తీవ్ర నేరానికి పాల్పడిన దృష్ట్యా 17ఏళ్ల బాలుడికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అదే తరహాలో జూబ్లీహిల్స్‌లో బాలికపై మైనర్లు అత్యాచారానికి పాల్పడటం పోలీసులు తీవ్ర నేరంగా పరిగణిస్తున్నారు. బాలికను మభ్యపెట్టి, భయాందోళనలకు గురి చేసి సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులు విచారణలో తేలిన విషయం తెలిసిందే. తాము చేసేది నేరమని తెలిసీ నిందితులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు..ఈ నేపథ్యంలో అభియోగపత్రం దాఖలు చేసే సమయంలో నిందితులైన మైనర్లను మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును కోరాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు న్యాయ సలహా తీసుకుంటున్నట్లు సమాచారం.