అమెరికాలోని కాలిఫోర్నియాలొ భారీ వర్షాలు.భారీ విపత్తు …!.

అమెరికాలోని కాలిఫోర్నియాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని వారాలుగా తుపాను కారణంగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలిఫోర్నియాలో భారీ విపత్తు చోటుచేసుకుందని చెప్పారు. విపత్తు వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు తగిన వైద్య, ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. విరిగిపడ్డ మట్టి చరియలు, బురదలో చిక్కుకున్న బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ..మరోవైపు భారీ వరదల వల్ల ఇప్పటి వరకు కనీసం 19 మంది మృతి చెందారు. సముద్ర తీరంలో అలలు భారీ ఎత్తున ఎగసి పడుతున్నాయి. 34 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. జాతీయ రహదారులపై కూడా వరద నీరు ప్రవహిస్తోంది. మరో తుపాను కూడా పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 24 వేలకు పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.