మే 6న తెరుచుకోనున్న కేదారినాథ్ ఆలయాలు..చార్ దామ్ యాత్ర వివరాలు..!

భారతీయుల అత్యంత పవిత్రమైన చార్ ధామ్ హిమాలయ యాత్రా వివరాలను ఉత్తరాఖండ్ దేవాదాయశాఖ అధికారులు ప్రకటించారు. అందులో భాగంగా 2022 ఏడాదికి గానూ పవిత్ర కేదార్ నాథ్ ఆలయాన్ని మే6న ఉదయం 6.25 గంటలకు తెరవనున్నట్లు అధికారులు వెల్లడించారు. అదే విధంగా బద్రీనాథ్ ఆలయాన్నీ మే 8న మిగిలిన రెండు చార్ధామ్ ఆలయ పుణ్యక్షేత్రాలు, గంగోత్రి మరియు యమునోత్రి ధామ్యాత్రను మే 3న అక్షయ్ తృతీయ రోజున తెరవనున్నారు.

*కేదార్‌నాథ్ ఆలయాన్ని తెరిచేందుకు శుభఘడియలు….మహాశివరాత్రి వేడుక సందర్భంగా ఓంకారేశ్వర్ ఆలయంలో శాస్త్రోక్తకంగా చేపట్టిన పూజా కార్యక్రమాలను పరమశివుడికి అంకితం చేసిన అర్చకులు.. కేదార్‌నాథ్ ఆలయాన్ని తెరిచేందుకు శుభఘడియలను లెక్కించి ప్రకటించారు.

మందాకిని నది ఒడ్డున…ఉత్తరాఖండ్ లోని గర్వాల్ హిమాలయాల్లోని మందాకిని నది ఒడ్డున ఉన్న “చార్ ధామ్” పవిత్రాలయాలలో కేదార్ నాథ్ ఒకటి. పురాణాల ప్రకారం, ఈ ఆలయం పాండవులచే స్థాపించబడింది. శివుడికి అంకితం చేయబడిన 12 జ్యోతిర్లింగాలలో ప్రధానమైనది ఈ కేదార్ ఆలయం. ఈ ఆలయానికి చేరుకోవాలంటే సుమారు 14 – 16 కిలోమీటర్ల మేర హిమాలయ పర్వతాల్లో కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది. ఏటా చలికాలంలో ఈ ఆలయాన్ని మూసి తిరిగి వేసవి ప్రారంభం అయ్యాక తెరుస్తారు. మే నెల నుంచి అక్టోబర్ వరకు కేదార్‌నాథ్ ఆలయం తెరిచి ఉంటుంది…