కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు అహంకారం తగ్గడం లేదని, మాట తీరులో మార్పు రావడం లేదు.. కడియం శ్రీహరి..

అసెంబ్లీ, పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించినప్పటికి బీఆర్ఎస్ నేతలకు, కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు అహంకారం తగ్గడం లేదని, మాట తీరులో మార్పు రావడం లేదని..అందుకే ప్రజలు ఆ పార్టీకి ఓటు వేయడం లేదు అని మాజీ మంత్రి, స్టేషన్ ఘన పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన కడియం బీఆర్ఎస్ నాయకుల తీరుపై మండిపడ్డారు. అధికారం కుటుంబ హక్కు అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు, కల్వకుంట్ల కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జాతిపితలు దేశానికి ఒక్కరే ఉంటారని, ఆయనే మహాత్మా గాంధీ అన్నారు. కేసీఆర్ ఏం చేశారని జాతిపిత అని చెప్పుకుంటున్నారు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో అవినీతితో వేలకోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు అని కడియం ఆరోపించారు.

2014 ముందు మీ కుటుంబం ఆస్తులు ఎన్ని ? ఇప్పుడు ఎన్ని ఉన్నాయో.. ప్రజల ముందు పెట్టాలని బీఆర్ ఎస్ నేతలను కడియం డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో అందరూ కేసుల్లో ఉన్నారని గుర్తు చేశారు. అవినీతి అంశంలో బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడితే తెలంగాణను అవమానించినట్లా అని కడియం ప్రశ్నించారు. తెలంగాణ మీ అయ్య సొత్తా అని, ఎన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ వాడుకుంటారు అని కడియం విమర్శించారు.