కలియుగ ఆది పురుషుడు అంట..
60 గుంటల జాగిస్తే అందులో పెద్ద గుడే కడతాడట.. అందులో స్వయంగా ఆయనే కొలువు తీరతాడట..
గోవిందా అంటూ ఐదు సార్లు తన చుట్టూ తిరిగితే కోరిన కోరికలను కూడా తీరతాయి అంట..
ఐదు శనివారాలు ఇలా చేస్తే చాలు అంటున్న స్వామీ…
తెలంగాణలోని పాలమూరు జిల్లాలో ఓ అవతారపురుషుడి హవా నడుస్తోంది.
సాక్షాత్తు కళియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాసుడు.. శ్రీమాహావిష్ణువు అవతారంలో ప్రజలందరికీ దర్శనమిస్తున్నాడు. తానే దేవుడినని.. ఎలాంటి కష్టాలున్నా ఇట్టే కడతేరుస్తానంటూ ప్రజలకు భరోసానిస్తున్నాడు. ఇంకేముంది.. భక్తులంతా ఆ అవతార పురుషుడి దర్శనానికి క్యూ కట్టారు.కళియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటుటారు. అయితే.. ఇప్పుడు ఆ శ్రీనివాసుడే ప్రజల కష్టాలు స్వయంగా తీర్చేందుకు మానవ అవతారంలోకి వచ్చాడు. ఇది ఎవరో కాదు.. సాక్షాత్తు ఆ అవతారపురుషుడే సెలవిచ్చాడు. శేషతల్పంపై.. ఇద్దరు లక్ష్ములతో అచ్చం శ్రీమహావిష్ణువుగా భక్తులకు దర్శనం ఇస్తూ.. తన చుట్టూ తిరిగితే చాలు ఎన్ని కష్టాలున్నా.. ఇట్టే మాయం చేస్తానని ఓపెన్‌గానే చెప్తున్నాడు. కష్టాలు తీర్చే కలియుగ దైవమే భూమి మీదికి.. అదీ మానవ అవతారంలో వస్తే ఇంకేమైనా ఉందా.. ఆ అవతార పురుషుడిని దర్శించుకునేందుకు భక్తులు ఎగబడ్డారు. కుప్పలు కుప్పలుగా క్యూకట్టేసి మరీ.. దర్శించుకుని పులకించిపోతున్నారు..ఆయన తెలుగువాడు కాదు.. ఆ తమిళనాడుకు చెందిన వ్యక్తి. “మానవ రూపంలో ఉన్న శ్రీనివాసున్ని నేను.. నా చుట్టూ తిరిగితే మీ కష్టాలు ఇట్టే మాయం అవుతాయి. నేనే పరమాత్ముడిని.. అవతారపురుషుడిని.. నా చెంతకు రండి.. నేనే దేవుడ్ని..” అంటూ తమిళనాడుకు చెందిన రంగనాథం అనే వ్యక్తి జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం కొండాపురం స్టేజ్ దగ్గర కొలువుదీరాడు. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారంలో.. శేషతల్పంపై నిద్రిస్తూ తన ఇద్దరు భార్యలను లక్ష్మి అమ్మవారి అవతారాల్లో చూపుతూ ప్రజలను ఆకర్షిస్తున్నాడు. అయితే.. తనలో గోవిందుడు కొలువు దీరాడని… తానే దేవుడ్ని అని.. రోగమేదైనా ఇట్టే నయం చేస్తానంటూ ప్రజలకు అభయమిస్తున్నాడు.
ఆ.. అవతారపురుషుడి మాటలు నమ్మిన జనం.. కుప్పలు తెప్పలుగా వెళ్తున్నారు. భక్తుల రద్దీ ఎంతగా ఉందంటే.. అక్కడ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇలా అయితే కాదని.. ఆ అవతార పురుషుడిని పోలీసులు మరో ప్రాంతానికి తరలించారు. భక్తులు పిచ్చిగా నమ్ముతున్న ఆ అవతార పురుషుని అసలు కథను పోలీసులు బయటపెట్టేశారు. ఈ దొంగ బాబాకు గతంలోనే కౌన్సెలింగ్ ఇచ్చామని.. అయినా తన తీరులో మార్పు లేదని స్థానిక ప్రజలకు వివరించారు..