ధర్మంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు మరో వివాదంలో..!

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల వివాదం ఇంకా ముగియకముందే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో వివాదానికి తెర లేపారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరు చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర వివాదాన్ని సృష్టించాయి. హిందూ సంఘాలతో పాటు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఈ గొడవ తగ్గక ముందే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి తెరలేపాయి. కేరళ రాష్ట్రంలోని ఓ హిందూ దేవాలయంలో చొక్కా విప్పమన్నారని.. తాను గుడిలోకి ప్రవేశించ లేదని చెప్పారు. బయట నుంచే దేవుడిని ప్రార్థించుకొని వచ్చానని పేర్కొన్నారు. ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.

‘‘ఒకసారి నేను కేరళలోని ఓ ఆలయానికి వెళ్లగా.. చొక్కా తీసి లోపలికి రమ్మని అడిగారు. దీంతో నేను గుడిలోకి వెళ్లేందుకు నిరాకరించి, బయటి నుంచై ప్రార్థిస్తానని చెప్పాను. అలాగే బయట నుంచి మొక్కి వచ్చాను. అయితే అందరినీ చొక్కాలు తీయమని చెప్పలేదు. కొందరిని మాత్రమే తీయమని చెప్పారు. ఇది అమానవీయమైన ఆచారం. దేవుడి ముందు అందరూ సమానమే’’ అని సిద్ధరామయ్య అన్నారు. సంఘ సంస్కర్త నారాయణ గురు 169వ జయంతిని పురస్కరించుకుని బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు మాట్లాడారు. దక్షిణ భారత దేశంలోని అనేక దేవాలయాల్లో… గుడిలోకి వెళ్లే ముందు పురుషులు తమ చొక్కాలను తీసివేయడం సాధారణ ఆచారంగా వస్తోంది. అయితే చొక్కా తీసిన తర్వాత భుజాల పైనుంచి ఓ టవల్ వేసుకుంటారు. ఇది చాలా కాలంగా వస్తున్న సంప్రదాయమే.