సంక్రాంతి వేడుకలు.. కనుమ రోజు పశువులను ఎందుకు పూజించాలంటే…

సంక్రాంతి వేడుకలు.. కనుమ రోజు పశువులను ఎందుకు పూజించాలంటే..*

సంక్రాంతి అంటే పంటల పండుగే అని అందరికీ తెలిసిందే. కానీ ఆ పంటలు బాగా పండాలంటే, పశువుల సాయం కూడా కావాలిగా! అందుకే సంక్రాంతి మర్నాడు కనుమని పశువుల పండుగగా పిలుస్తారు. పశువులు ఉన్నవారు ఆ రోజు వాటిని శుభ్రంగా అలంకరించి మంచి ఆహారం పెడతారు. పక్షులకి కూడా ఆహారం అందేలా ఇంటిచూరుకి ధాన్యపు కంకులు వేలాడదీస్తారు.

*పశువులకు కృతజ్ఞత*

సంక్రాంతి మూడో రోజు పశువుల ప్రాధాన్యత పండుగ కనుమ పచ్చని తోరణాలతో, కళకళలాడుతూ! ‘సంక్రాంతి’ లక్ష్మీని ఆహ్వానిస్తూ ఈ పండగలో మూడవ రోజు కనుమ అని పశువుల పండుగ. పంట పొలాల నుండి తమ ఇంటి కొచ్చిన పంటను భారతీయ హిందూ ధర్మం ప్రకారం ఒక గొప్పనైన సంస్కృతిగా ఆచరిస్తారు. రైతులకు వ్యవసాయ క్షేత్రంలో పంటలకు సహయపడిన పశువును అవి చేసిన సహాయానికి కృతజ్ఞతగా పండిన పంటను తామేకాక, పశువులు, పక్షులతో పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు.

*పంట పొలాలల్లో వీటి పాత్ర ఎంతో ఉంది*

పల్లెల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంట పొలాలల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని గౌరవించి శుభ్రంగా అలంకరించి పూజించి, వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. పల్లె ప్రాంతాలలో కనుమ పండుగను వైభవంగా జరుపుకుంటారు. తమకి సుఖ సంతోషాలను అందించడం కోసం అహర్నిశలు కష్టపడుతూ అవి పోషిస్తున్న పాత్రను రైతులు మరిచిపోరు. తమ జీవనాధారమైన పశువుల పట్ల కృతజ్ఞతగా వాళ్లు ‘కనుమ’ రోజున వాటికి విశ్రాంతినిచ్చి పూజిస్తారు.

*పశువులతో రైతుల అనుబంధం*

పశువులతో తమకి గల అనుబంధాన్ని చాటుకుంటారు. కనుమ రోజున వాళ్లు పశువులను నదీ తీరాలకు గానీ, చెరువుల దగ్గరికి గాని తీసుకు వెళ్లి స్నానం చేయిస్తారు. ఆ పశువుల నుదుటున పసుపు, కుంకుమదిద్ది వాటి మెడలో మువ్వల పట్టీలు కడతారు. వాటి కొమ్ములకు ప్రత్యేకంగా తయారు చేయబడిన వివిధ రకాల కొప్పులను తగిలిస్తారు. వీపుపై అలంకార శోభితమైన పట్టీ తగిలిస్తారు. అలంకరణ పూర్తయిన తరువాత వాటిని పూజించి హారతిని ఇస్తారు. పశువులకు ఇష్టమైన ఆహారాన్ని సమర్పించి వాటిని ఉత్సాహంగా ఊరేగిస్తారు.ఈ పర్వధినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి కార్యక్రమము చేస్తుంటారు. ఇదంతా రైతుల సంగతి. కానీ మిగతావారు పాటించే ఆచారాలు కూడా చాలా ఉన్నాయి.