బీజేపీ నేతలు ఎవరూ ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోలేదు అంటు కీలక వ్యాఖ్యలు చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య..!!

ప్రధాని నరేంద్రమోదీపై, భారతీయ జనతాపార్టీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్రమోదీ ఎప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్లినా ఉగ్రవాదంపై పోరాడుదాం అంటూ ప్రసంగాలు చేస్తారని, ఇప్పటివరకు బీజేపీ నేతలు ఎవరూ ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోలేదని వ్యాఖ్యానించారు.బీజేపీ నేతలు తరచూ కాంగ్రెస్‌ పార్టీపై విషం చిమ్ముతుంటారని, కాంగ్రెస్‌ పార్టీ ఉగ్రవాదానికి మద్దతు నిలిచిందని ఆరోపణలు చేస్తుంటారని చెప్పారు. అదే నిజమైతే కాంగ్రెస్‌ అగ్ర నేతలు ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ ఉగ్రవాదుల దాడుల్లో ఎందుకు ప్రాణాలు కోల్పోయేవారని ప్రశ్నించారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.