కర్ణాటకలో దేశ చిత్రపటంపై దుమారం.. స్పందించిన కాంగ్రెస్..

కర్ణాటకలోని (Karnataka) బెళగావిలో కాంగ్రెస్‌ ‘నవ సత్యాగ్రహ్‌ బైఠక్‌’ (సీడబ్ల్యూసీ సమావేశం) ప్రారంభమైంది. జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరంభించారు…ఈ సందర్భంగా హస్తం పార్టీ ఏర్పాటు చేసిన బ్యానర్‌ల (Congress banner) కారణంగా దుమారం చెలరేగింది. అందులో భారత చిత్రపటాన్ని తప్పుగా చూపడమే అందుకు కారణం. దీంతో కాంగ్రెస్‌పై భాజపా (BJP)విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది.

”బ్యానర్‌లోని భారత చిత్రపటంలో జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలు కనిపించకుండా పోయాయి. కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగం చేసేలా చిత్రపటాన్ని వక్రీకరించింది. దీన్ని ప్రదర్శించడం భారత సార్వభౌమాధికార గౌరవానికి భంగం కలిగించడమే అవుతుంది. ఓట్ల బ్యాంకును పెంచుకునేందుకే ఇందతా చేస్తోంది. నిజంగా ఇది సిగ్గుచేటు..! తక్షణమే బ్యానర్లు తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి” అంటూ సీఎం సిద్ధరామయ్యను భాజపా ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా డిమాండ్‌ చేసింది.

”గాంధేయ భారత్‌ పేరుతో కొందరు కాంగ్రెస్‌ వ్యక్తులు దేశ చిత్రపటాన్ని వక్రీకరించారు. స్వార్థం, బుజ్జగింపు రాజకీయాల కోసం కాంగ్రెస్‌ ఎలాంటి పని చేయడానికైనా సిద్ధంగా ఉంటుందనడానికి ఈ బ్యానర్లే నిదర్శనం. భారత ఐక్యత, సమగ్రతను కాపాడతామంటూ ప్రమాణం చేసిన కాంగ్రెస్‌ నేతలు వాటిని ఉల్లంఘించడం ఆందోళనకరం. చిత్రపటంలో కొన్ని ప్రాంతాలను తొలగించేందుకు కారణం ఏంటి..? ఇది ఆ పార్టీ కుట్రలో భాగమా..?” అని భాజపా నేత సుధాంశు త్రివేది ప్రశ్నించారు.

దేశాన్ని అస్థిర పరిచేందుకు యూఎస్‌ పెట్టుబడిదారు జార్జ్‌ సోరోస్‌తో కాంగ్రెస్‌ చేతులు కలిపిందని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన హస్తం పార్టీ ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను ఖండించింది. ఆ బ్యానర్లను తమ పార్టీ అధికారికంగా పెట్టింది కాదని.. ఎవరో అనుచరులు పెట్టి ఉండొచ్చు అని పేర్కొంది..