కర్నూలు జిల్లాలో ఉగ్ర ఛాయలు…!

ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యాత్మికతకు పెట్టింది పేరు. అనేక పుణ్య క్షేత్రాలు ఇక్కడ వున్నాయి. భక్తుల రాకతో ఎప్పుడు సందడిగా ఉంటుంది. అయితే, ఈ అధ్యాత్మిక జిల్లాల్లో ఉగ్ర విషనాగులు చేరాయా. నెమ్మదిగా పుట్టలు పెట్టి కుట్రలు చేసేందుకు సిద్ధం అవుతున్నాయా.? అందుకే ఎన్ఐఏ అధికారులు ఉమ్మడి కర్నూలు జిల్లా పై నిఘా పెట్టారా? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు అనేకం వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదం ఈ మాట వింటేనే గుండెల్లో గుబులు పుడుతుంది..ముంబై మారణకాండ, హైదరాబాద్ లో జంట పేలుళ్ళు, దిల్‌శుక్ నగర్ లో ఉగ్రవాదుల దాడి వంటివి మాయని గాయాలుగానే వున్నాయి. ఇక దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు వెలుగు చూసినా వాటి మూలాలు హైదరాబాద్‌లో తేలుతూనే వున్నాయి. ఇక హైదరాబాద్ కు అత్యంత సమీపంలో వున్నా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా ఉగ్రవాదుల డెన్లు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాపై ఎన్ ఐ ఏ అధికారులు నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదుల లింక్ లు ఇక్కడ కూడా వుండే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు నిఘా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. గత కొద్ధి రోజుల క్రితం NIA అధికారులు కర్నూలు జిల్లాకు వచ్చారు. ఇద్దరు అనుమానితులను ప్రశ్నించారు. దింతో ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులు ఉలిక్కి పడ్డారు..