కవిత అరెస్టుపై ఈడీ కీలక ప్రకటన..!

*కవిత అరెస్టుపై ఈడీ కీలక ప్రకటన..*

*ఆ యాక్ట్ కిందే చర్యలు తీసుకున్నామని వెల్లడి..*

దిల్లీ మద్యం కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఉదయం నుంచి సుదీర్ఘ సోదాల అనంతరం ఈడీ అధికారులు కవితను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. కవిత అరెస్టుపై ఆమె సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఈడీ అధికారులు ప్రీవెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ – పీఎంఎల్ యాక్ట్ ద్వారా అరెస్టు చేసినట్లు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం. 5.20 గంటలకు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ పేరుతో అరెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు.

“ఎంఎల్‌సీ కవిత.. మనీల్యాండరింగ్ నిరోధక చట్టం -2002 కింద శిక్షార్హమైన నేరానికి పాల్పడ్డారని విశ్వసించేందుకు నా వద్ద కారణాలు ఉన్నాయని ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న జోగేందర్ అనే నేను తెలియజేస్తున్నాను. మనీల్యాండరింగ్ చట్టంలోని సెక్షన్ 19లోని సబ్ సెక్షన్(1) కింద నాకు ఉన్న అధికారాల మేరకు ఎంఎల్‌సీ కవితను అరెస్ట్ చేస్తున్నానని తెలియజేస్తున్నాను. సాయంత్రం 5 గంటలకు అరెస్ట్ చేశాం. అరెస్టుకు గల కారణాలను వివరిస్తూ 14 పేజీలతో కూడిన రిపోర్టును కవితకు అందజేశాం.” అని నోటీసులో పేర్కొన్నారు.

అరెస్టుపై స్పందించిన కవిత, ఆమె కుటుంబ సభ్యులు ఈడీ అధికారులతో సంపూర్ణంగా సహకరిస్తామని తెలిపారు. ఈ అరెస్టును అక్రమ అరెస్టుగా అభివర్ణించిన గులాబీ నేతలు న్యాయపరంగా, శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొంటామని అన్నారు. కవిత తరలింపునకు ఆటంకాలు లేకుండా రోప్ పార్టీ ఏర్పాట్లు చేశారు. అరెస్టుని అడ్డుకోవద్దని, పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా వ్యవహరించాలని కోరిన కేటీఆర్, హరీష్ రావు, ఇతర పార్టీ సీనియర్ నాయకులు అన్నారు.

కవిత అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. ఆమె ఇంటి వద్దకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అరెస్టుపై ఈడీ జేడీ భాను ప్రియ మీనాతో కేటీఆర్ కు వాగ్వాదం జరిగింది. దీంతో కేటీఆర్ కు ఈడీ జేడీ మీనా అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవితను కాసేపట్లో దిల్లీకి తరలించనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి విస్తారా ఫ్లైట్ లో రాత్రి 8:45 నిమిషాలకు కవితను దిల్లీకి తీసుకెళ్లనున్నారు..