వెన్నెల విహారం….

శీర్షిక:”వెన్నెల విహారం”

నువ్వు గుర్తొస్తే
నా పెదవులపై
సరాగాల నవ్వు ప్రత్యక్షమై
నా హృదయం
సప్తవర్ణాల హరివిల్లుగా
మారిపోతుందని
నాకు మాత్రమే తెలుసు….!!

కనురెప్పలు వాలగానే
అశ్వ వేగాన నా కళ్ళల్లో
నీ మోహన రూపం ప్రత్యక్షమై
కాటుక కనులు
సిగ్గు బరువుతో
వాలి పోతున్నాయని
నాకు మాత్రమే తెలుసు….!!

నీ తలపులు రాగానే
నా మదిలో
చిలిపి జ్ఞాపకాలు ప్రత్యక్షమై ….
నా అనురాగ వీణపై
హృదయరాగం శృతిచేసే….
“చెలిమిని పెంచిన నెలరాజు”
నీవేనని‌‌….
నాకు మాత్రమే తెలుసు….!!

తొలి సంధ్య వేళ
వలపు వాకిట
చూపుల దీపాలతో
తోరణాలు కట్టాను
నీ జతగా… ఏడేడు జన్మలు
“వెన్నెల విహారం” చేయాలని….!!