అన్ని నియోజకవర్గాల్లో శుక్రవారం ధర్నాలు… సీఎం కేసీఆర్.

అన్ని నియోజకవర్గాల్లో శుక్రవారం ధర్నాలు ..

70 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన..

ఏటా ఎంప్లాయిమెంట్‌ క్యాలెండర్‌ విడుదల..

గొర్ల పథకంలో కేంద్రానిది పైసా ఉందన్నానేను రాజీనామా చేస్తా..

సీఎం సవాల్‌ సమాధానం చెప్పలేకనే బండి సొల్లు మాటలు..

వరి పంట పండించి రోడ్ల మీద పడొద్దు..బీజేపీవాళ్లను ఎక్కడికక్కడ నిలదీయాలి…

మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌

రైతు చట్టాలు సుప్రీంకోర్టు నిలిపివేసిందని అంటున్నవు…నువ్వు విరమించుకుంటవా? లేదా? పంజాబ్‌లో పూర్తిస్థాయి ధాన్యం సేకరిస్తున్నరు. అదేవిధంగా తెలంగాణ వడ్లను కేంద్రం కొంటదా? కొనదా? ఒక రాష్ర్టానికి సీఎంగా, ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా సీదాగా అడుగుతున్నా. సమాధానం చెప్పేదాకా బీజేపీని, కేంద్రాన్ని వదిలిపెట్టేది లేదు.

తెలంగాణలో వడ్లను కొంటరో? లేదో? సూటిగా చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని సీఎం కేసీఆర్‌ నిలదీశారు. ధాన్యం కొనుగోలులో కేంద్రం కుటిలనీతిని బయటపెట్టాలని, రైతులకు నిజం తెలియాల్సిందేనని స్పష్టంచేశారు. వడ్ల కొనుగోలుపై తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. బండి సంజయ్‌ పారిపోయి సొల్లు పురాణం చెప్తున్నాడని ఎద్దేవా చేశారు. ఆదివారం నాటి మీడియా సమావేశంలో తాను సంధించిన ప్రశ్నలకు బండి సంజయ్‌ వితండవాదాలతో మాట్లాడటంపై సోమవారం రెండో రోజు ఆయన మీడియాతో అదే ఫైర్‌తో మాట్లాడారు. కేంద్రం సమాధానం చెప్పేదాకా బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని వెంటాడుతామన్న కేసీఆర్‌.. ‘బ్యాటిల్‌ విల్‌ కంటిన్యూ’ అంటూ.. రాబోయే రోజుల్లో సైతం బీజేపీ బండారాన్ని మీడియా సాక్షిగా బయటపెడుతానని నిర్దంద్వంగా ప్రకటించారు.

‘తెలంగాణలో పండించే వడ్లు కొంటరా? కొనరా? సింపుల్‌ క్వశ్చన్‌. మీ సమాధానం ఏంది?’ అని బీజేపీ నేతలను, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ను కేసీఆర్‌ ప్రశ్నించారు. ‘రైతు చట్టాలు సుప్రీంకోర్టు నిలిపివేసిందని అంటున్నవు. నువ్వు విరమించుకుంటవా? లేదా? పంజాబ్‌లో పూర్తిస్థాయి ధాన్యం సేకరిస్తున్నరు. అదేవిధంగా తెలంగాణ వడ్లను కేంద్రం కొంటదా? కొనదా? ఒక రాష్ర్టానికి సీఎంగా, ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా సీదాగా అడుగుతున్నా. సమాధానం చెప్పేదాకా బీజేపీని వదిలిపెట్టేది లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వదిలిపెట్టేది లేదు’ అని కేసీఆర్‌ అన్నారు. ‘యాసంగిలో వడ్లు పండించండి.. మెడలు వంచి కొనిపిస్తం అని చెప్పిన మాట వాస్తవమా? కాదా? దీని నుంచి పారిపోయినవా?’ అని బండిని నిలదీశారు. తానేమీ ఉర్దూలోనో, ఇంగ్లిష్‌లోనో, తెలియని భాషలో అడుగుతలేనని, నీకు అర్థమయ్యే తెలుగులోనే అడుగుతున్నానని చెప్పారు.

రోడ్డుమీద పోస్తే రాజకీయమైతది..
వరికి కనీస మద్దతుధర వస్తదో, రాదో తెలియని ఘోరమైన పరిస్థితిని కేంద్రం సృష్టిస్తున్నదని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం పాలసీ ఘోరంగా ఉన్నదని, రాష్ట్రం దగ్గర మెకానిజం లేదని, కాబట్టి వరిని వేసి దెబ్బతినొద్దని సూచించారు. ‘పంట పండించి రోడ్ల మీద పడి ధర్నాలు చేస్తే రాజకీయాలు అయితయిగానీ, రైతుల జేబులు నిండయి’ అని హితవు పలికారు. ఇన్ని స్కీములు పెట్టి, ఎన్ని విమర్శలు వచ్చినా తట్టుకొని వ్యవసాయానికి అన్ని వసతులు కల్పించామని చెప్పారు. భూ గర్భజలాలు చాలా పైకి వచ్చాయని, మరోవైపు చక్కటి వర్షాలు కురిశాయన్న సీఎం.. మంచి సీజన్‌ ఉన్నది కాబట్టి వేరే పంటలు వేయాలని కోరారు. కేంద్రం ధాన్యాన్ని కొనడానికి నిరాకరిస్తున్నది కాబట్టే ఈ మాట చెప్పాల్సి వస్తున్నదని స్పష్టంచేశారు.

మీ బిడ్డగా చెప్తున్నా .. మాయ మాటలు నమ్మొద్దు
రాజకీయాల కోసం సొల్లు కార్చేటోళ్ల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దనేదే తన తపన అని సీఎం అన్నారు. రైతులు ధైర్యం కోల్పోకుండా, వారి ఆర్థిక పరిస్థితి దిగజారిపోవద్దనే ఇతర పంటలు వేయాలని కోరుతున్నామని తెలిపారు. ‘మీ బిడ్డగా చెప్తున్నా. నా పానం మీదికి తెచ్చుకొని తెలంగాణను సాధించుకొచ్చిన మనిషిని. ఈ పిచ్చోళ్ల మాటలు పట్టుకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే అయితది’ అని రైతులకు హితవు పలికారు.

వడ్ల సంగతి పక్కన పెట్టమని బండికి పైనుంచి!..
కేంద్రమంత్రి నుంచి ఫోన్లు రాగానే, ఇక్కడి బండి తోకముడిచారని కేసీఆర్‌ చురకలంటించారు. రుణమాఫీ చేయడం లేదని బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. మ్యానిఫెస్టోలోనే దశలవారీగా చేస్తామని ప్రకటించామని, కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో కొంత వెనకాముందు అయిందని వివరించారు. కచ్చితంగా రైతు రుణమాఫీ చేసి తీరుతామన్న కేసీఆర్‌.. ‘ఇచ్చేది ప్రభుత్వం, తీసుకునేది రైతులు. కందకు లేని దురద కత్తికి ఎందుకు?’ అంటూ బీజేపీ నేతలను ఉద్దేశించి అన్నారు. ‘నిన్న ఢిల్లీ నుంచి (బండికి) షంటింగ్‌ పడింది. ‘ఇగ వడ్లు ఇడిషిపెట్టు.. కేసీఆర్‌ దేశద్రోహి అని మొదలువెట్టు’ అని ఢిల్లీ నేతలు చెప్పినట్టున్నారు’ అని ఎద్దేవా చేశారు.

ఉత్తమ పత్తి మనదగ్గరే….

ప్రపంచంలో బెస్ట్‌ క్వాలిటీ పత్తి తెలంగాణలో ఉన్నదని గతంతో తాను చెప్పింది ఇప్పుడు నిజమవుతున్నదని సీఎం అన్నారు. తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉన్నదని చెప్పారు. ప్రస్తుతం రూ.8,500 వరకు ధర పలుకుతున్నదని, సీసీఐ కొనకపోయినా, జిన్నింగ్‌ మిల్లులు పోటీపడి కొంటున్నాయన్నారు. ఇతర పంటలు ఏవి వేయాలో వ్యవసాయశాఖ అధికారులు చెప్తారని, తగినన్ని విత్తనాలు అందుబాటులోకి తెస్తారని తెలిపారు.

వడ్ల కొనాలంటూ రైతులతో కలిసి ధర్నా
వరిధాన్యం కొనేది లేదన్న కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటానికి దిగబోతున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ధాన్యం కొనాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో లక్షల మంది రైతులతో కలిసి ధర్నా చేయనున్నట్టు ప్రకటించారు. ధాన్యం కొనేవరకు ఇక్కడ బీజేపీ నేతల్ని, ఢిల్లీ నేతల్ని ఎవర్నీ వదిలిపెట్టేది లేదని స్పష్టంచేశారు. తెలంగాణ రైతాంగం పక్షాన ధర్నా చేయబోతున్నామన్న కేసీఆర్‌ ‘మాతోపాటు మీరు (రాష్ట్ర బీజేపీ నేతలు) కూర్చుంటరా? లేదా?’ అని ప్రశ్నించారు. ఈ ధర్నాలో ఎవరు కలిసి వచ్చినా ఆహ్వానిస్తామని తెలిపారు. ‘తెలంగాణ రైతాంగం కోసం మేం ఎట్లా కొట్లాడబోతున్నమో.. ఇగ చూడండి. ఎట్ల వెంటాడుతమో.. వడ్లు కొనేదాకా ఎట్ల ఉరికిపిస్తమో చూడండి.. మిమ్మల్ని ఎట్ల ఎక్స్‌పోజ్‌ చేస్తమో చూడండి’ అని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ వాళ్లను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు.