ఉపఎన్నికలపై సూచనలు..ప్రజల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత..మళ్లీ మనదే అధికారం….. కేసిఆర్..

ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సూచించారు..నేడు తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ కమిటీలను వేయాలని నిర్ణయించారు. కమిటీలకు ఇన్‌ఛార్జిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు..పార్టీ స్థాపించి 25 ఏళ్లు కావస్తున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు(Silver Jubly Celebrations) ఏడాది పొడవునా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. పార్టీలో వ్యవస్థాగత కమిటీలు వేసేందుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అదే విధంగా.. పార్టీలో మహిళా కమిటీలు(BRS Woman Committees) ఏర్పాటు చేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఆయా కమిటీలకు ఇన్ఛార్జిగా హరీష్ రావు(Harish Rao)ను నియమిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 10 నుంచి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి జిల్లాలో చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 10న బీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించి.. పార్టీ ప్లీనరీ సమావేశాలపై చర్చిస్తామని కేసీఆర్ తెలియ జేశారు..

ప్రజల్లో వ్యతిరేకత

ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి పాలనపై ప్రజలలో వ్యతిరేకత పెరుగుతున్న విధానంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సీఎంపై ఇంత తొందరగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనుకోలేదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆదాయం ప్రతి సంవత్సరం పెరుగుతుందని చెప్పారు. కానీ ప్రస్తుతం మాత్రం ప్రభుత్వంలో రాష్ట్ర ఆదాయం పడిపోతుందని ఆరోపించారు. అదే అధికారులు ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వానికి చేయించుకోవడం రావడం లేదని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ఆయన యువ నేతలకు కష్టపడి పనిచేయాలని సూచించారు…

ఉపఎన్నికలపై సూచనలు

ఈ క్రమంలో రాష్ట్రంలో త్వరలో ఉపఎన్నికలు వస్తాయని, అందుకు సంబంధించి పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. మళ్లీ మనదే అధికారమని, మీరే ఎమ్మెల్యేలు అవుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కేసీఆర్, టీడీపీ పార్టీ ప్రాస్థానం, కష్టనష్టాలు, ఎన్టీఆర్ కాలం గురించి వివరిస్తూ, ప్రజల మద్దతు పొందేందుకు పార్టీ కార్యకర్తలను ప్రోత్సహించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠను పెంచాయని చెప్పవచ్చు. ముఖ్యంగా కమ్యూనిస్టులపై చేసిన విమర్శలు, టీడీపీ ప్రస్తావనతోపాటు సీఎంపై వ్యతిరేకత అంశం వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.